Chandrababu Naidu: ఒంటిమిట్ట చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

Chandrababu Naidu Arrives in Ontimitta for Sitarama Kalyanam
షార్ట్స్‌లో చూడండి
కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటిమిట్టకు చేరుకున్నారు. ఆయన తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో 'పేదల సేవలో' కార్యక్రమాన్ని ముగించుకుని ఆయన నేరుగా ఇక్కడికి విచ్చేశారు. 

ఒంటిమిట్ట చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ గెస్ట్ హౌస్ వద్ద చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు హృదయపూర్వక స్వాగతం పలికారు. బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, శాంతారాం, దర్శన్ ... చంద్రబాబుకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.

ఈ కల్యాణ వేడుక కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గత రెండు నెలలుగా విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షలాది మంది భక్తులు వీక్షించేందుకు వీలుగా కల్యాణ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రి 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జరిగే కల్యాణంలో పాల్గొన్న అనంతరం చంద్రబాబు గజవాహన సేవను వీక్షిస్తారు. గురువారం ఉదయం ఆయన హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వెళ్లనున్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు 5 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నారు. భక్తుల కోసం లక్షలాది లడ్డూలు, అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను టీటీడీ సిద్ధం చేసింది. సుమారు 2,500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందిస్తున్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Ontimitta
Kodandarama Swamy Temple
Sitarama Kalyanam
Andhra Pradesh
TTD
Kalyanamahotsavam
Kadapa District
Tirupati
Hindu Festival

More Telugu News