Ketan Mehta: ఇరాన్‌లో 75 రోజుల నరకయాతన... ప్రాణాలతో బయటపడిన భారతీయుడి భయానక అనుభవాలు

ఇరాన్‌లో 50 రోజుల జైలు జీవితం, ఆ తర్వాత 25 రోజుల పాటు యుద్ధం మధ్య హోటల్‌లో నిర్బంధం... మొత్తం 75 రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన కేతన్ మెహతా ఎట్టకేలకు ప్రాణాలతో సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. జైలు నుంచి విడుదలైన మరుసభటి రోజే యుద్ధం మొదలవడంతో ఆయన తిరిగి రావడం పెను సవాలుగా మారింది. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితులను కేతన్ వివరించారు.

ఫిబ్రవరి 27న ఇరాన్ జైలు నుంచి విడుదలైన తనను అధికారులు ఒక హోటల్‌కు తరలించారని కేతన్ తెలిపారు. మరుసటి రోజు (ఫిబ్రవరి 28న) భారత్‌కు తిరిగి రావాల్సి ఉండగా, అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. "జైలు నుంచి హోటల్‌కు వచ్చినప్పుడు, మరుసటి రోజే యుద్ధం వస్తుందని మాకు తెలియదు. ఒక్కసారిగా అంతా మూతపడింది. ఎయిర్‌పోర్టును కూడా మూసివేశారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు" అని కేతన్ ఆందోళన వ్యక్తం చేశారు.

తాము బస చేసిన హోటల్, ఇరాన్ నౌకాదళ ప్రధాన స్థావరమైన బందర్ అబ్బాస్ నగరానికి కేవలం 600-700 మీటర్ల దూరంలోనే ఉందని ఆయన చెప్పారు. "యుద్ధ వాతావరణం నెలకొనడంతో హోటల్ విడిచి బయటకు రావద్దని భారత రాయబార కార్యాలయం మాకు సూచించింది. ప్రతిరోజూ బాంబులు, క్షిపణుల శబ్దాలు వినిపించేవి. హోటల్ కిటికీ నుంచి చూస్తే, కళ్ల ముందే క్షిపణులు వర్షంలా కురిసేవి. రోజుకు 100 నుంచి 200 బాంబులు పడేవి" అని ఆయన తెలిపారు.

అక్కడి నుంచి బయటపడే ప్రయాణం కూడా అత్యంత కఠినంగా సాగిందని కేతన్ వివరించారు. ఆయన బందర్ అబ్బాస్ నుంచి సుమారు 1800 కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి ఆర్మేనియా సరిహద్దుకు చేరుకున్నారు. "దాదాపు 18-19 గంటల ఆ ప్రయాణమంతా సమీప పర్వతాల్లోంచి పేలుళ్ల శబ్దాలు వస్తూనే ఉన్నాయి. బస్సు తీవ్రంగా కంపించిపోయేది. ఆ భయం మధ్యలోనే ఆర్మేనియా సరిహద్దుకు చేరుకున్నాం" అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ కష్టకాలంలో భారత ఎంబసీ అధికారులు నిరంతరం తనతో టచ్‌లో ఉంటూ ధైర్యం చెప్పడం ఊరటనిచ్చిందని కేతన్ అన్నారు.

గతేడాది డిసెంబర్ 8న అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న ‘ఎంటీ వాలియంట్ రోర్’ అనే ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డీజిల్ రవాణా చేస్తున్నారని ఆరోపించి, అందులో కేతన్ మెహతా సహా 10 మంది భారత సిబ్బందిని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. అయితే, ఈ ఆరోపణలను ట్యాంకర్ నిర్వాహక సంస్థ ఖండించింది. విదేశాంగ శాఖ చొరవతో బందర్ అబ్బాస్ జైలులో ఉన్న ఈ 10 మందికి కాన్సులర్ యాక్సెస్ లభించింది.
Ketan Mehta
Iran
Indian citizen
Gaziabad
Valiant Roar
oil tanker
Bander Abbas
Armenia border
hostage
Indian Embassy

More Telugu News