Shelly Kittilson: ఇరాక్‌లో అమెరికా జర్నలిస్ట్ కిడ్నాప్.. ఇరాన్ మిలీషియా పనేనన్న యూఎస్

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఓ అమెరికన్ జర్నలిస్ట్ కిడ్నాప్‌కు గురయ్యారు. ఈ ఘటన వెనుక ఇరాన్ మద్దతున్న స్థానిక మిలీషియా గ్రూప్ హస్తం ఉందని అమెరికా ఆరోపించింది. జర్నలిస్ట్ విడుదలకు వీలైనంత త్వరగా ప్రయత్నాలు చేస్తున్నట్లు యూఎస్ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ప్రాంతంలో విదేశీయుల భద్రతపై ఈ ఘటన మరోసారి ఆందోళనలను పెంచింది.

కిడ్నాప్‌కు గురైన జర్నలిస్ట్‌ను ఫ్రీలాన్స్ రిపోర్టర్ షెల్లీ కిటిల్సన్‌గా మీడియా హక్కుల సంస్థలు గుర్తించాయి. ఈ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ సహాయ కార్యదర్శి డైలాన్ జాన్సన్ ‘ఎక్స్’లో స్పందించారు. "జర్నలిస్ట్‌కు ముప్పు పొంచి ఉందని మేం ముందే హెచ్చరించాం. ఆమెను సురక్షితంగా విడిపించేందుకు ఎఫ్‌బీఐతో కలిసి పనిచేస్తున్నాం" అని తెలిపారు. కిడ్నాప్‌లో ప్రమేయం ఉందని భావిస్తున్న ఇరాన్ అనుకూల మిలీషియా 'కతైబ్ హిజ్బుల్లా'తో సంబంధాలున్న ఒక వ్యక్తిని ఇరాక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని ఆయన వివరించారు.

మరోవైపు, బాగ్దాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు జర్నలిస్ట్‌ను అపహరించారని ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఒక అనుమానితుడిని అరెస్ట్ చేశామని, కిడ్నాప్‌కు ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది.

సిరియా, ఇరాక్ వంటి యుద్ధ క్షేత్రాల నుంచి విస్తృతంగా రిపోర్టింగ్ చేసిన అనుభవం కిటిల్సన్‌కు ఉంది. ఆమె కిడ్నాప్‌పై 'అల్-మానిటర్' వంటి సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా పౌరులు ఎవరూ ఇరాక్‌కు ప్రయాణించవద్దని, అక్కడ ఉన్నవారు వెంటనే దేశం విడిచి వెళ్లాలని యూఎస్ ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
Shelly Kittilson
American journalist
Iraq kidnapping
Baghdad
Iran militia
Kataib Hezbollah
US State Department
Dylan Johnson
Al-Monitor
Foreign security

More Telugu News