Iran: ఇక మీరు కూడా మా శత్రువులే... అమెరికా టెక్ దిగ్గజ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్!

Iran Warns US Tech Giants Meta Google Apple
షార్ట్స్‌లో చూడండి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సంచలన హెచ్చరిక జారీ చేసింది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా, గూగుల్, ఆపిల్ వంటి బడా అమెరికన్ టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని బెదిరించింది. ఈ సంస్థలు తమకు చట్టబద్ధమైన లక్ష్యాలని ప్రకటించింది.

ఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ ఈ వివరాలను వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఈ కంపెనీలపై దాడులు ప్రారంభిస్తామని ఐఆర్‌జీసీ స్పష్టం చేసినట్లు పేర్కొంది. మధ్యప్రాచ్యంలోని ఈ కంపెనీల కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది, సమీపంలో నివసించే ప్రజలు వెంటనే ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ఇజ్రాయెల్ జరిపిన దాడులకు, అమెరికా ఇంటెలిజెన్స్ అందించిన మద్దతుకు ప్రతీకారంగానే ఈ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ అత్యాధునిక కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీని ఉపయోగించి ఇరాన్‌కు చెందిన సుప్రీం లీడర్‌తో సహా 250 మందికి పైగా సీనియర్ అధికారులను హతమార్చిందని, దీనికి ఈ టెక్ కంపెనీలు సహకరించాయని ఐఆర్‌జీసీ ఆరోపిస్తోంది. అందుకే ఈ సంస్థలను 'చట్టబద్ధమైన లక్ష్యాలు'గా పరిగణిస్తున్నామని తన ప్రకటనలో పేర్కొంది.

మెటా, గూగుల్, ఆపిల్‌తో పాటు బోయింగ్, టెస్లా వంటి 15కు పైగా కంపెనీలు తమ హిట్ లిస్ట్‌లో ఉన్నాయని ఐఆర్‌జీసీ తెలిపింది. తమ నాయకులపై ఇలాంటి 'టార్గెటెడ్ హత్యలు' కొనసాగితే దాడుల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. కాగా, ఈ నెలలోనే బహ్రెయిన్, యూఏఈలలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై డ్రోన్ దాడులు జరిగినట్లు అమెజాన్ ధృవీకరించడం గమనార్హం.
Go Back to Shorts
Iran
Islamic Revolutionary Guard Corps
IRGC
America tech companies
Meta
Google
Apple
Israel
Middle East tensions

More Telugu News