Chandrababu Naidu: క్వాంటం అప్లికేషన్లతో ఆంధ్రప్రదేశ్ కే తొలి ప్రయోజనాలు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu AP First to Benefit from Quantum Applications
షార్ట్స్‌లో చూడండి
క్వాంటం కంప్యూటింగ్ అప్లికేషన్ల ద్వారా లభించే ప్రయోజనాలను దేశంలోనే తొలిగా అందుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తు సాంకేతికత అయిన క్వాంటం కంప్యూటింగ్‌లో 'ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్'ను అందిపుచ్చుకోవడం ద్వారా రాష్ట్రానికి అపార అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో 'అమరావతి క్వాంటం వ్యాలీ - క్వాంటం హార్డ్ వేర్ మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్' అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న అమరావతి క్వాంటం వ్యాలీ (ఏక్యూవీ), దేశానికే ప్రగతి ప్రేరకంగా నిలుస్తుందని అన్నారు.

ఈ కీలక సమావేశానికి నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సింఘీతో పాటు సీడాక్, సీడాట్, డీఆర్‌డీవో, బార్క్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. మూడు దశాబ్దాల క్రితం ఐటీని అందిపుచ్చుకుని హైదరాబాద్‌ను నాలెడ్జ్ ఎకానమీగా మార్చిన స్ఫూర్తితో, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీని ఏపీ అభివృద్ధికి చోదకశక్తిగా మలుస్తామని చంద్రబాబు వివరించారు. గతంలో ఐటీ నిపుణుల కోసం ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసినట్లే, ఇప్పుడు క్వాంటం నిపుణులను తీర్చిదిద్దేందుకు వైసర్, ఐబీఎం వంటి సంస్థల భాగస్వామ్యంతో యువతకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

'మేడ్ ఇన్ అమరావతి' క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం

రాబోయే రెండేళ్లలో 'మేడ్ ఇన్ అమరావతి' బ్రాండ్‌తో క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. క్వాంటం హార్డ్ వేర్, క్రయోజనిక్స్, అల్గారిథమ్స్ వంటివాటిని దిగుమతి చేసుకోకుండా, అమరావతి క్వాంటం వ్యాలీలోనే దేశీయంగా ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. 2030 నాటికి ప్రపంచంలోని 5 గ్లోబల్ క్వాంటం హబ్స్‌లో ఒకటిగా ఏపీని తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, హార్డ్ వేర్ ఎకోసిస్టంను ఏక్యూవీలో ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న 8 టవర్లలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌తో పాటు స్టార్టప్‌లు, పరిశోధనలకు అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ఈ ప్రణాళికలో భాగంగా, దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటం కంప్యూటర్‌ను ఏప్రిల్ 14వ తేదీన అమరావతిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు క్యూబిట్ ఫోర్స్ సంస్థ డైరెక్టర్ వెంకట్ సుబ్రమణ్యన్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ఈ సమావేశంలో ముఖ్యమంత్రికి తెలిపారు. విద్యార్థులు, పరిశోధకులు టెస్టింగ్ కోసం ఈ కంప్యూటర్ అందుబాటులో ఉంటుందని వారు వివరించారు. 

క్వాంటం టెక్నాలజీతో అమరావతి భవిష్యత్ నగరంగా, అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా మారుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బృహత్తర లక్ష్య సాధనకు అవసరమైన సాంకేతికత, భాగస్వామ్యం అందించాలని జాతీయ క్వాంటం మిషన్‌ను ఆయన కోరారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Amaravati Quantum Valley
Quantum Computing
Andhra Pradesh
Quantum Hardware Manufacturing
National Quantum Mission
Quantum Technology
Made in Amaravati
IT Development

More Telugu News