Chandrababu Naidu: క్వాంటం హబ్‌గా ఏపీ... అమరావతి వ్యాలీపై సీఎం చంద్రబాబు కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటం టెక్నాలజీ రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉండే ఐదు గ్లోబల్ క్వాంటం హబ్స్‌లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలన్న లక్ష్యంతో పటిష్టమైన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 'అమరావతి క్వాంటం వ్యాలీ- క్వాంటం హార్డ్‌వేర్ ఉత్పత్తి ఎకోసిస్టమ్‌' అనే అంశంపై ఉన్నతస్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 

ఈ కీలక భేటీకి జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సింఘీతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన సీడాక్, సీడాట్, డీఆర్డీఓ, బార్క్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. త్వరలో రూపుదిద్దుకోనున్న అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ పరికరాల తయారీ, ఇతర హార్డ్‌వేర్, అల్గారిథమ్స్ అభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. 'మేడ్ ఇన్ అమరావతి' విధానంతో క్వాంటం కంప్యూటర్ పరికరాలను ఉత్పత్తి చేసి ప్రపంచానికి అందించాలన్న ఆలోచనపై దృష్టి సారించారు.

అమరావతి క్వాంటం వ్యాలీలో అవసరమైన మౌలిక సదుపాయాలను వేగంగా కల్పించాలని, హార్డ్‌వేర్ తయారీకి అనువైన ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో కార్యాచరణను రూపొందించారు. పరిశోధన, ఆవిష్కరణలు, డిజైన్ల కోసం బయోఫౌండ్రీ సహా వివిధ స్టార్టప్‌లతో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. క్వాంటం కంప్యూటర్ తయారీకి అవసరమైన క్రయోజనిక్స్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

దేశంలోనే తొలిసారిగా క్వాంటం కంప్యూటింగ్ పాలసీని తీసుకొచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఈ సాంకేతిక ప్రయాణాన్ని ప్రారంభించిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రయాణంలో భాగంగా, మేధా టవర్స్‌లో ఇప్పటికే తాత్కాలికంగా క్వాంటం కంప్యూటింగ్ మిషన్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో అమరావతిని క్వాంటం టెక్నాలజీకి చిరునామాగా మార్చాలని ప్రభుత్వం ఈ సమావేశంలో దృఢంగా సంకల్పించింది.
Chandrababu Naidu
Andhra Pradesh
Quantum Technology
Amaravati Quantum Valley
Quantum Computing
Global Quantum Hubs
JB V Reddy
Quantum Hardware Manufacturing

More Telugu News