PM Modi: ప్రపంచ అశాంతికి సాంస్కృతిక వారసత్వమే పరిష్కారం: ప్రధాని మోదీ

Narendra Modi Says Cultural Heritage Solves World Unrest
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచం అస్థిరత్వంతో సతమతమవుతూ, అశాంతి జ్వాలలతో దహించుకుపోతున్న క్లిష్ట సమయంలో సాంస్కృతిక వారసత్వమే మానవాళికి మార్గం చూపుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇవాళ మహావీర్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని కోబా తీర్థ్‌లో ఏర్పాటు చేసిన 'సమ్రాట్ సంప్రతి మ్యూజియం'ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ మ్యూజియం ఇచ్చే సందేశం కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి అత్యంత కీలకమని అన్నారు.

అశోక చక్రవర్తి మనవడు, అహింసా మార్గాన్ని ప్రచారం చేసిన సమ్రాట్ సంప్రతి పేరుతో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సేకరించిన జైన సమాజానికి చెందిన అమూల్యమైన కళాఖండాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. వీటిలో కొన్ని 1000 సంవత్సరాల కంటే పురాతనమైనవి కావడం విశేషం. దశాబ్దాల పాటు తమ జీవితాలను అంకితం చేసి, భారతదేశం, నేపాల్ నుంచి ఈ కళాఖండాలను సేకరించిన జైన సన్యాసి ఆచార్య పద్మసాగర్‌ సూరీశ్వర్జీ సేవలను ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు.

ఈ మ్యూజియం కేవలం కళాఖండాల భాండాగారం మాత్రమే కాదని, ఇది జైన ఆరాధనకు, సంస్కృతికి, వారసత్వ పరిరక్షణకు ఒక శక్తిమంతమైన కేంద్రమని ప్రధాని మోదీ అభివర్ణించారు. కోబా తీర్థ్ ఎంతో కాలంగా శాంతికి, ఆధ్యాత్మిక సాధనకు నెలవుగా ఉందని గుర్తుచేశారు. ఈ మ్యూజియం రూపకల్పనలో వేదాలు, పురాణాలు, ఆయుర్వేదం వంటి భారతీయ సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని, ఇది మన భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థులు, పరిశోధకులు ఈ కేంద్రాన్ని పెద్ద సంఖ్యలో సందర్శించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ మ్యూజియంలో జైన తత్వశాస్త్రం, తీర్థంకరుల జీవితాలు, ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, ఆలయ నమూనాలు, చారిత్రక కళాఖండాలతో కూడిన ఏడు గ్యాలరీలు ఉన్నాయి. సంప్రదాయ ప్రదర్శనలతో పాటు ఆధునిక డిజిటల్, ఆడియో-విజువల్ టెక్నాలజీని మేళవించి సందర్శకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తున్నారు.

'వికాస్ భీ, విరాసత్ భీ'కి ఇది నిదర్శనమన్న గుజరాత్ ప్రభుత్వం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఈ మ్యూజియం సాంస్కృతిక పరిరక్షణ కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ.. 'వికాస్ భీ, విరాసత్ భీ' (అభివృద్ధి, వారసత్వం రెండూ) అనే ప్రభుత్వ దార్శనికతకు ఈ మ్యూజియం నిదర్శనమని, ప్రధాని చేతుల మీదుగా ఇది ప్రారంభం కావడం జైన సమాజానికి గర్వకారణమని తెలిపారు.
Go Back to Shorts
PM Modi
Narendra Modi
Samrat Samprati Museum
Gujarat
Jainism
Cultural Heritage
Mahavir Jayanti
Koba Tirth
Acharya Padmasagarsuriji
Bhupendra Patel
Indian traditions

More Telugu News