Jio Hotstar: బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన జియో హాట్ స్టార్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అలరిస్తున్న ఐపీఎల్ 2026 ప్రసార హక్కుల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించి అక్కడి ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ టీ-స్పోర్ట్స్ (T-Sports)తో ఉన్న ఒప్పందాన్ని జియో హాట్ స్టార్ రద్దు చేసుకుంది. ఈ మేరకు టీ-స్పోర్ట్స్ యాజమాన్యానికి జియో హాట్ స్టార్ అధికారికంగా లేఖ రాసింది.
వాస్తవానికి జియో హాట్ స్టార్ - టీ-స్పోర్ట్స్ మధ్య 2027 వరకు ఐపీఎల్ ప్రసారాల కోసం ఒప్పందం ఉంది. అయితే, ఒప్పంద నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన బకాయిల విషయంలో టీ-స్పోర్ట్స్ సంస్థ విఫలమైనట్లు తెలుస్తోంది. ఆర్థిక పరమైన లావాదేవీల్లో స్పష్టత లేకపోవడం, సకాలంలో చెల్లింపులు జరగకపోవడంతోనే జియో హాట్ స్టార్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ ప్రసారాలపై అక్కడి ప్రభుత్వం గతంలో నిషేధం విధించింది. అయితే, తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో ఐపీఎల్ మ్యాచ్‌లను చూడొచ్చని ఆశపడ్డ అభిమానులకు జియో హాట్ స్టార్ నిర్ణయం పిడుగులాంటి వార్తగా మారింది.