Chelluri Narayana Rao: ఏపీ పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత

దేశవ్యాప్తంగా మావోయిజం నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న వేళ, మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, పార్టీలో కీలక వ్యూహకర్తగా ఉన్న చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ పరిణామం ఏవోబీ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికిని దాదాపు లేకుండా చేసినట్లయ్యిందని భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


నారాయణరావు ప్రస్థానం పీపుల్స్ వార్ కాలం నుంచే ప్రారంభమైంది. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పలు కీలక హోదాల్లో పనిచేశారు. ఏవోబీ ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలను విస్తరించడంలో, రిక్రూట్‌మెంట్లు చేపట్టడంలో ఆయనది కీలక పాత్ర. అటవీ ప్రాంతంలో దశాబ్దాల కాలం పాటు గెరిల్లా పోరాటంలో ఆరితేరిన సోమన్న లొంగుబాటును ఏపీ డీజీపీ త్వరలోనే అధికారికంగా ధ్రువీకరించనున్నారు.


గత ఏడాది కాలంగా ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల్లో భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ మావోయిస్టుల కోటలను బద్దలు కొట్టింది. ముఖ్యంగా, 2026 మార్చి 31 (రేపు) నాటికి దేశంలో మావోయిజాన్ని పూర్తిగా అంతం చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్దేశించిన లక్ష్యం దిశగా బలగాలు దూసుకుపోతున్నాయి. ఈ గడువు ముగియడానికి కేవలం కొన్ని గంటల ముందే అత్యంత కీలక నేత సోమన్న లొంగిపోవడం గమనార్హం.

Chelluri Narayana Rao
Maoist
Surrender
Andhra Pradesh Police
AOB
Anti Maoist Operation
Operation Kagar
Naxal
Amit Shah
Chhattisgarh

More Telugu News