Dhurandhar 2: ఆ సినిమా చూసి నేర్చుకోండి.. లేదంటే సమాధి అవుతారు: బాలీవుడ్‌కు ఆర్జీవీ హెచ్చరిక

Ram Gopal Varma Warns Bollywood Learn from Dhurandhar2 or Perish
షార్ట్స్‌లో చూడండి
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో మరోసారి చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) చిత్రం సాధించిన భారీ విజయంపై ఇండస్ట్రీ వర్గాలు అవలంబిస్తున్న మౌనాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి దర్శకుడు ఆదిత్య ధర్‌ను ప్రశంసిస్తున్న వర్మ, తాజాగా పరిశ్రమ నిశ్శబ్దంపై తనదైన రీతిలో స్పందించారు.

ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వర్మ స్పందిస్తూ... "ఆదిత్య ధర్ 'ధురంధర్ 2'తో చిత్ర పరిశ్రమ పునాదుల కింద ఒక 'అణుబాంబు' పేల్చారు. ఇంత జరుగుతున్నా మిగిలిన పరిశ్రమలో కనిపిస్తున్న ఈ నిశ్శబ్దం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది" అంటూ వర్మ తన విమర్శలకు పదును పెట్టారు. ఈ భారీ పేలుడు ధాటికి బాలీవుడ్ మందంతా అంతరిక్షంలోకి విసిరివేయబడ్డారా? అందుకే వారి చప్పట్లు మనకు వినపడటం లేదా? అని ఆయన ఎద్దేవా చేశారు.  లేదంటే 'ఇదంతా ప్రచారంలే.. త్వరలోనే పోతుంది' అని గుసగుసలాడుకుంటూ, మళ్లీ తమ పాత మూస సినిమాలను తీయడానికి సిద్ధమవుతున్నారా? లేదా ఆ సినిమా అద్భుతాన్ని చూసి, తాము తీస్తున్న, తీయాలనుకుంటున్న సినిమాలు ఏమాత్రం సరిపోవని గ్రహించి నిర్ఘాంతపోయారా?" అంటూ ఘాటుగా ప్రశ్నించారు.

ఈ సినిమా విజయాన్ని అంగీకరించాల్సిన ఆవశ్యకతను వర్మ నొక్కిచెప్పారు. కళ్ల‌ముందు 'ధురంధర్ 2' అనే డైనోసార్ నిలబడి నిప్పులు కురిపిస్తుంటే, బాక్సాఫీస్ గర్జనతో భూమి కంపిస్తుంటే.. దానిని పట్టించుకోకుండా ఉండటం కంటే మూర్ఖత్వం మరొకటి ఉండదని ఆయన పేర్కొన్నారు.  

"పరిశ్రమలోని నా సహోద్యోగులందరికీ నా సలహా ఏంటంటే.. దయచేసి 'ధురంధర్ 2'ను సీరియస్‌గా తీసుకోండి. సినిమా నిర్మాణంపై ఒక సరికొత్త కోర్సులా దాన్ని అధ్యయనం చేయండి. లేదంటే, మార్చి 19కు ముందు నాటి సినిమా అనే శ్మశానంలో మీరంతా సమాధి కావడం ఖాయం" అని హెచ్చరించారు. 

‘ధురంధర్ 2’ ఒక పాఠ్యపుస్తకం
కేవలం విమర్శలకే పరిమితం కాకుండా సినిమాపై వర్మ సుదీర్ఘ సమీక్షను కూడా పంచుకున్నారు. సినిమా విద్యార్థులకు సలహా ఇస్తూ.. "మీ ఇన్‌స్టిట్యూట్‌లను వదిలేసి, ఆ డబ్బును, సమయాన్ని 'ధురంధర్ 2' థియేటర్లలో వెచ్చించండి" అని సూచించారు. 

దర్శకుడు ఆదిత్య ధర్, నటులు రణ్‌వీర్‌ సింగ్, మాధవన్‌లపై ప్రశంసల వర్షం
దర్శకుడు ఆదిత్య ధర్ సినిమాను కేవలం దర్శకత్వం చేయలేదని, సినిమా అనే ఆయుధాన్ని సృష్టించారని కొనియాడారు. యాక్షన్‌ను, భావోద్వేగాలను అద్భుతంగా మిళితం చేశారని ప్రశంసించారు. దాదాపు నాలుగు గంటల నిడివి ఉన్నా, కథనం వేగంగా సాగడంతో ఎక్కడా బోర్ కొట్టలేదని తెలిపారు. రణ్‌వీర్ సింగ్ నటన అద్భుతమని, ఆర్. మాధవన్ నియంత్రిత నటన ఆకట్టుకుందని అన్నారు. ఈ సినిమా భవిష్యత్ సినిమాకు ఒక బెంచ్‌మార్క్ అని, దీన్ని కేవలం చూడటమే కాకుండా ఒక పాఠ్యపుస్తకంలా అధ్యయనం చేయాలని వర్మ తన సమీక్షను ముగించారు.
Go Back to Shorts
Dhurandhar 2
Ram Gopal Varma
RGV
Aditya Dhar
Bollywood
Ranveer Singh
R Madhavan
movie review
film industry
box office

More Telugu News