Revanth Reddy: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జీతంలో 15 శాతం కట్... తెలంగాణ అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. అలాంటి వారి జీతంలో 15 శాతం వరకు కోత విధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లును ఆదివారం తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా ఈ చట్టం వర్తించనుంది.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, వయోవృద్ధుల శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ సభలో "తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు, 2026"ను ప్రవేశపెట్టగా, సభ్యులందరూ దీనికి మద్దతు తెలిపారు. ఈ కొత్త చట్టం ప్రకారం, తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని తేలిన ఉద్యోగుల స్థూల జీతం (గ్రాస్ శాలరీ) నుంచి 15 శాతం కోత విధిస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా వారి తల్లిదండ్రులకు చెల్లిస్తారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించడంలో ఈ బిల్లు ఒక చరిత్రాత్మక ముందడుగు అని అభివర్ణించారు. సమాజంలో మానవ సంబంధాలు, బంధుత్వాలు బలహీనపడి, కేవలం సంపాదన, భౌతిక సుఖాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "కన్నవారు కన్నీరు పెట్టే పరిస్థితి రావడం సమాజానికి మంచిది కాదు. తల్లిదండ్రులను గౌరవించని వారిలో భయం కలిగించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చాం" అని సీఎం స్పష్టం చేశారు.

2007లో కేంద్రం చట్టం తెచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదని, అందుకే ఈ బిల్లును ఒక సామాజిక బాధ్యతగా తీసుకొచ్చామని తెలిపారు. "ఏ ఒక్క తల్లి లేదా తండ్రి తమ చివరి రోజుల్లో నిరాశ్రయులు కాకూడదన్నదే మా ఉద్దేశం" అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

నా ఆవేదనే ఈ కొత్త చట్టం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ సమాజంలో ఏ కుటుంబంలోనూ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలిపోకూడదన్న బలమైన సంకల్పంతోనే ఈ రోజు శాసనసభలో ఒక కీలకమైన బిల్లును ప్రవేశపెట్టాం. వృద్ధాప్యంలో కన్నవారికి అండగా నిలవాలనే బాధ్యత, భావోద్వేగంతో ఆలోచించి “తెలంగాణ ఎంప్లాయిస్ అకౌంటబిలిటీ, మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్లు - 2026”ను సభ ముందుకు తీసుకొచ్చాం. తల్లిదండ్రుల పట్ల భక్తి లేనివారిలో భయాన్ని కలిగించడమే ఈ చట్టం ఉద్దేశం.

ఈ రోజుల్లో మనిషి బంధాలు, అనుబంధాలను మరిచిపోయి భౌతిక సుఖాల కోసం పాకులాడుతున్నాడు. చివరికి పేగుబంధాన్ని కూడా విస్మరిస్తున్నాడు. కన్నవారి కన్నీళ్లు ఈ సమాజానికి అస్సలు మంచిది కాదు. పిల్లలు, మహిళల రక్షణ కోసం మన దేశంలో ఎన్నో చట్టాలున్నాయి. కానీ వృద్ధుల సంరక్షణ విషయంలో ఉన్న చట్టాలు సరిపోవడం లేదు. బతికున్నప్పుడు గుక్కెడు మెతుకులు పెట్టని బిడ్డలు, వారు పోయాక ఆస్తుల కోసం కొట్లాడుకోవడం చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది.

పురాణాల్లో శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల సేవకే జీవితాన్ని అంకితం చేశాడు. మనందరం ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటే ఇలాంటి చట్టాల అవసరమే రాదు. కానీ నేటి పరిస్థితులు అలా లేవు. వేలకోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన రేమండ్స్ అధినేత విజయ్ పథ్ సింఘానియా తన ఆస్తినంతా కొడుక్కి రాసిచ్చి, చివరి రోజుల్లో సొంత ఇంటి నుంచి గెంటేయబడి అద్దె ఇంట్లో ఉండాల్సిన దుస్థితిని చూశాం. "పిల్లలకు సర్వస్వం ఇచ్చి నేను పెద్ద తప్పు చేశాను, నాకంటే దారుణమైన స్థితి ఏ తండ్రికీ రాకూడదు" అని ఆయన తన ఆత్మకథలో రాసుకున్న మాటలు మనసును కలిచివేస్తాయి.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ఒకరు కాకపోయినా మరొకరు పెద్దవాళ్లను చూసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాకు తెలిసిన ఒక ప్రజాప్రతినిధే తండ్రికి క్యాన్సర్ వస్తే చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేశాడు. ఇలాంటి వారిని సమాజం బహిష్కరించాలి. అందుకే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులే కాదు, ప్రజాప్రతినిధులమైన మనల్ని కూడా ఈ చట్టం పరిధిలోకి చేర్చాం.

ఈ చట్టంతో అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని నేను చెప్పడం లేదు. కానీ, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఒక భరోసా, ధైర్యం ఇవ్వాలన్నదే మా ప్రయత్నం. ఇది ఒక సామాజిక బాధ్యత. అందుకే ఈ బిల్లుకు పార్టీలకు అతీతంగా అందరూ ఏకగ్రీవంగా మద్దతివ్వాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను... అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Revanth Reddy
Telangana
Parental Support Bill 2026
Employees Accountability
Old Age Parents
Maintenance Act
Welfare Schemes
Indian Laws
Social Responsibility
Government Jobs

More Telugu News