Indian Vessels: గల్ఫ్ ప్రాంతాన్ని సురక్షితంగా దాటిన రెండు భారత నౌకలు

గల్ఫ్ ప్రాంతం నుంచి రెండు భారీ ఎల్పీజీ క్యారియర్లు సురక్షితంగా భారత్ తీరం వైపు ప్రయాణిస్తున్నాయి. బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్ఎమ్ అనే ఈ నౌకల్లో సుమారు 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ఈ మేరకు ఆదివారం కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, బీడబ్ల్యూ టీవైఆర్ నౌక మార్చి 31న ముంబైకి, బీడబ్ల్యూ ఈఎల్ఎమ్ నౌక ఏప్రిల్ 1న న్యూ మంగళూరుకు చేరుకోనున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న భారత నౌకలు, నావికుల భద్రతకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, గత 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 18 భారత నౌకలు, 485 మంది భారత నావికులు ఉన్నట్లు తెలిపింది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్), నౌకల యజమానులు, భారత రాయబార కార్యాలయాలతో కలిసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24×7 పనిచేస్తోందని, ఇప్పటివరకు 942 మంది నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో సహాయపడిందని పేర్కొంది. గత 24 గంటల్లో నలుగురు నావికులను తరలించిన్నట్టు తెలిపింది.

భారత్‌లోని అన్ని ఓడరేవుల్లో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని, ఎక్కడా రద్దీ లేదని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాంగ శాఖ, ఇతర సముద్రయాన భాగస్వాములతో కలిసి నావికుల సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపింది. గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని భారతీయుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, 24×7 హెల్ప్‌లైన్‌లు పనిచేస్తున్నాయని విదేశాంగ శాఖ వివరించింది.
Indian Vessels
BW TYR
BW ELM
LPG Carriers
Gulf Region
Shipping Ministry
Directorate General of Shipping
Indian Navy
Maritime Security

More Telugu News