Palla Srinivasa Rao: తెలుగుదేశం 44 ఏళ్ల ప్రస్థానం.. కార్యకర్తలే పార్టీకి ఊపిరి: పల్లా శ్రీనివాసరావు

తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని నిలబడటానికి కార్యకర్తల త్యాగాలే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. కార్యకర్తలే పార్టీకి ఊపిరి అని, వారి చెమట చుక్కల ఫలితంగానే నేడు పసుపు జెండా రెపరెపలాడుతోందని కొనియాడారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

కార్యకర్తలే పార్టీకి ప్రాణం
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సామాన్య కార్యకర్తలను వేదికపైకి ఆహ్వానించి గౌరవించడం టీడీపీ గొప్పతనానికి నిదర్శనమని పల్లా అన్నారు. "కార్యకర్తే అధినేత" అనే నినాదాన్ని తమ పార్టీ నిజం చేసిందని చెప్పారు. 44 ఏళ్ల ప్రస్థానంలో పార్టీ నిలబడిందంటే అది కేవలం కార్యకర్తల వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. టీడీపీ కార్యకర్తల గుండెచప్పుడు లేకపోతే ఈ ఉద్యమమే లేదని ఆయన పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ఆశయాలు.. చంద్రబాబు బాటలు
1982కు ముందు రాజకీయాలు ఒక వర్గానికే పరిమితమయ్యాయని, పేదలు, రైతులు రాజకీయాల్లోకి రావాలంటే ఎగతాళి చేసేవారని పల్లా గుర్తుచేశారు. అణగారిన వర్గాల ఆవేదన నుంచి పుట్టిన ఎన్టీఆర్, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటడమే కాకుండా, సామాన్యులకు రాజకీయ అధికారాన్ని అందించారని కొనియాడారు. 

ఎన్టీఆర్ స్థాపించిన సిద్ధాంతాలను, ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. నీతి, నిజాయతీతో పనిచేస్తే సామాన్య కార్యకర్తకు కూడా పార్టీలో ఉన్నత స్థాయి లభిస్తుందనడానికి తానే ఒక నిదర్శనమని అన్నారు. అలాగే, తన తండ్రికి ఎన్టీఆర్, చంద్రబాబు ఇచ్చిన గుర్తింపును గుర్తుచేసుకున్నారు.

లోకేశ్ నాయకత్వం.. భవిష్యత్తుకు భరోసా
పార్టీ భవిష్యత్తు గురించి ప్రస్తావిస్తూ, యువనేత నారా లోకేశ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. "మన భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదు. 'యువగళం' పాదయాత్ర ద్వారా తన సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన నాయకుడు లోకేశ్. మనల్ని సమర్థవంతంగా నడిపించే నాయకత్వం మనకుంది. కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు" అని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను, చంద్రబాబు అనుభవాన్ని అందిపుచ్చుకుని పార్టీని ముందుకు నడిపించే సత్తా, సమర్థత లోకేశ్ కు ఉన్నాయని, పార్టీ భవిష్యత్తుకు ఆయన నాయకత్వమే శ్రీరామరక్ష అని పల్లా బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

గత పాలనపై విమర్శలు.. భవిష్యత్ కార్యాచరణ
గత వైసీపీ ప్రభుత్వంపై పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అవినీతి పునాదులపై జగన్ తన పార్టీని నిర్మించారని ఆరోపించారు. 'ఒక్క ఛాన్స్' అంటూ అధికారంలోకి వచ్చి ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చారని, కక్ష సాధింపు రాజకీయాలతో ఎంతోమంది ప్రాణాలు తీశారని విమర్శించారు. అలాంటి అరాచక పాలనను అంతం చేసిన ఘనత టీడీపీ కార్యకర్తలదే అని అన్నారు. ఇక్కడితో ఆగిపోకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో 'స్వర్ణాంధ్ర' నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో మళ్లీ జయకేతనం ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు.





Palla Srinivasa Rao
Telugu Desam Party
TDP
Chandrababu Naidu
Nara Lokesh
TDP Formation Day
Andhra Pradesh Politics
Political Party
Telugu States
YCP Government

More Telugu News