ధోనీ, సచిన్ లపై కేసు నమోదు
ఓ వాణిజ్య ప్రకటనలో నటించి వినియోగదారులను తప్పుదోవ పట్టించారంటూ టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్ సహా మరో ఆరుగురు క్రికెటర్లపై ఉత్తరాఖండ్ లో కేసు నమోదైంది. క్రికెటర్లే కాకుండా సదరు వాణిజ్య ప్రకటన స్వంతదారు సహారా ఇండియా అధిపతి సుబ్రతా రాయ్, బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, ప్రియాంక చోప్రాలపైనా కేసు దాఖలైంది. ఉత్తరాఖండ్ లోని బహాద్రాబాద్ లో ఓ సహారా క్యూ షాప్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆహార ఉత్పత్తుల్లో కల్తీ జరిగిందని ఫుడ్ సేఫ్టీ విభాగం తెలిపింది. దీంతో, ఈ కల్తీ ఉత్పత్తులకు ప్రచారం చేసిన క్రికెటర్లు, సినీ తారలు ప్రజలను తప్పుదోవ పట్టించినట్టైంది. కాగా, ఈ వాణిజ్య ప్రకటనల్లో ధోనీ, సచిన్ లే గాక సెహ్వాగ్, రైనా, కోహ్లీ, యువరాజ్ సింగ్, గంభీర్, జహీర్ ఖాన్ లు కూడా నటించారు.