Asim Munir: పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలపై భారత్ మండిపాటు

Asim Munir Remarks Draw Ire from India
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ దేశంలోని షియా మత పెద్దలతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ పట్ల సానుభూతి ఉన్నవారు అక్కడికే వెళ్లిపోవాలని మునీర్ అన్నట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించింది. పాకిస్థాన్‌లో మైనారిటీలపై, ముఖ్యంగా షియా వర్గంపై జరుగుతున్న వ్యవస్థాగత అణచివేతకు ఈ వ్యాఖ్యలు నిదర్శనమని పేర్కొంది.

శుక్రవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. "ఇవి విడివిడిగా జరిగిన ఘటనలు కావు. పాకిస్థాన్‌లో మైనారిటీలను బాధితులుగా మార్చే సుదీర్ఘకాలపు కుట్రలో భాగమే ఈ వ్యాఖ్యలు. గడిచిన కొన్నేళ్లుగా పాక్‌లో మైనారిటీల సంఖ్య దారుణంగా తగ్గిపోవడమే వారు ఎదుర్కొంటున్న భయానికి, అణచివేతకు నిదర్శనం. మైనారిటీల మానవ హక్కుల పరిరక్షణలో పాకిస్థాన్ రికార్డు ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు" అని జైస్వాల్ వివరించారు.

ఓవైపు ప్రపంచ వేదికలపై 'ఇస్లామోఫోబియా' అంటూ గగ్గోలు పెట్టే పాకిస్థాన్, సొంత దేశంలో మాత్రం ముస్లిం మైనారిటీలపై దాడులు చేయడంపై ఇటీవలి నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూరోపియన్ టైమ్స్ కథనం ప్రకారం, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకే పాకిస్థాన్ బాధితురాలిగా నటిస్తూ దౌత్య ఎత్తుగడలకు పాల్పడుతోంది.

పాకిస్థాన్‌లో షియా వర్గంపై దాడులు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని, వారి మసీదులు, ఊరేగింపులపై దాడులు జరిగినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆ నివేదిక పేర్కొంది. ఇక అహ్మదియా వర్గం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వారిని రాజ్యాంగబద్ధంగానే ముస్లిమేతరులుగా ప్రకటించి చట్టపరమైన వివక్ష, సామాజిక బహిష్కరణ, హింసకు పాల్పడుతున్నారు. పొరుగున ఉన్న ముస్లిం దేశమైన అఫ్గానిస్థాన్‌లో రంజాన్ మాసంలో కూడా సైనిక చర్యలు జరిపి పౌరుల మరణాలకు కారణమవడం కూడా పాక్ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది.
Go Back to Shorts
Asim Munir
Pakistan
India
Shia Muslims
Minority Rights
Islamophobia
Human Rights Violation
Randhir Jaiswal
Pakistan Army Chief
Religious Discrimination

More Telugu News