G Parameshwara: ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఎమ్మెల్యేల డిమాండ్‌లో తప్పులేదన్న కర్ణాటక హోంమంత్రి

G Parameshwara Says No Wrong in MLAs Demanding IPL Tickets
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ మ్యాచ్‌ల వీక్షణం కోసం ఎమ్మెల్యేలు వీఐపీ టికెట్లు, ప్రత్యేక గౌరవం ఆశించడంలో ఎలాంటి తప్పు లేదని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర వ్యాఖ్యానించారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ జరిగిన మరుసటి రోజే ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల డిమాండ్‌ను సమర్థించారు. అయితే, టికెట్ల పంపిణీలో ప్రభుత్వ ప్రమేయం పరిమితంగానే ఉంటుందని, తుది నిర్ణయం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) యాజమాన్యాలదేనని స్పష్టం చేశారు.

అంతకుముందు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ఇబ్బందులను స్పీకర్ యు.టి. ఖాదర్ అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రస్తుతం ఒక్కో ఎమ్మెల్యేకు కేవలం ఒక సాధారణ టికెట్ మాత్రమే ఇస్తున్నారని, దీనివల్ల వారు మ్యాచ్‌కు వెళ్లినప్పుడు సిబ్బంది గుర్తుపట్టక అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది, ప్రతి ఎమ్మెల్యేకు కనీసం నాలుగు వీఐపీ టికెట్లు కేటాయించి, వారికి తగిన గౌరవం లభించేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. స్పీకర్ వ్యాఖ్యలకు సభ్యులందరూ బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు.

ఈ చర్చలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక జోక్యం చేసుకుంటూ, క్రికెట్ అధికారులు అంత సులభంగా లొంగరని, స్టేడియంలో బార్లు, మద్యం లైసెన్సుల (CL-7) వంటి విషయాల్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే వారే దారికి వస్తారని సూచించారు. దీనిపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఈ అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

హోంమంత్రి పరమేశ్వర మాట్లాడుతూ... "2025లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత భద్రతా విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మైఖేల్ డి'కున్హా కమిషన్ సిఫార్సులను కేఎస్‌సీఏకి తెలిపాం. భద్రతా మార్గదర్శకాలు పాటిస్తేనే మ్యాచ్‌లు నిర్వహించాలని స్పష్టం చేశాం. వారు అందుకు అంగీకరించారు. టికెట్లు అడగటం తప్పు కాదు, కానీ ఎలా పంచాలనేది వారి ఇష్టం" అని వివరించారు.
Go Back to Shorts
G Parameshwara
Karnataka Home Minister
IPL tickets
MLA demand
KSCA
RCB
Chinnaswamy Stadium
UT Khader
DK Shivakumar
R Ashok

More Telugu News