అమ్ముడైన ఆర్సీబీ.. పేరు మారుతుందా?.. అభిమానుల ప్రశ్నకు సమాధానం ఇదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే సంచలనం నమోదైంది. అత్యంత ప్రజాదరణ కలిగిన ఫ్రాంచైజీలలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతులు మారింది. సుమారు 1.78 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.16,660 కోట్లు) రికార్డు ధరకు ఆర్సీబీని ఆదిత్య బిర్లా గ్రూప్ (ఏబీజీ) నేతృత్వంలోని ఓ కన్సార్టియం కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఇప్పటివరకు ఆర్సీబీ యాజమాన్య హక్కులు కలిగిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్), తన 100 శాతం వాటాను ఈ కన్సార్టియంకు విక్రయించినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

ఆదిత్య బిర్లా గ్రూప్‌తో పాటు అమెరికన్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్‌కు చెందిన బోల్ట్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్‌కు చెందిన బీఎక్స్‌పీఈ, మీడియా దిగ్గజం టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఈ కన్సార్టియంలో భాగస్వాములుగా ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌సీఎస్‌పీఎల్)లో ఉన్న తమ పూర్తి వాటాను విక్రయించినట్లు యునైటెడ్ స్పిరిట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ పూర్తిగా నగదు రూపంలో జరిగిందని, దీని విలువ రూ.16,660 కోట్లు అని స్పష్టం చేసింది. ఈ కొనుగోలుతో ఐపీఎల్‌లోని పురుషుల జట్టుతో పాటు, మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆడే మహిళల జట్టు హక్కులు కూడా కొత్త యాజమాన్యానికి బదిలీ అయ్యాయి.

ఈ భారీ ఒప్పందం నేపథ్యంలో అభిమానులలో ఒకటే ప్రశ్న మెదులుతోంది. జట్టు పేరు ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ను మారుస్తారా? లేదా? అన్నదే ఆ సందేహం. అయితే, జట్టు పేరు మారకపోవచ్చని తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో కీలక వ్యక్తిగా ఉన్న అనన్య బిర్లా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పరోక్షంగా దీనిపై స్పష్టతనిచ్చారు. జట్టు పేరు మారబోదని చెప్పే ఒక పోస్ట్‌ను ఆమె రీపోస్ట్ చేయడంతో ఆర్సీబీ పేరు యథాతథంగా కొనసాగుతుందని అభిమానులు భావిస్తున్నారు.

2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న ఎనిమిది జట్లలో ఆర్సీబీ ఒకటి. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025లో ఈ జట్టు తొలిసారిగా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2025 నవంబర్ 5న ఆర్‌సీఎస్‌పీఎల్‌పై యూఎస్ఎల్ ప్రారంభించిన వ్యూహాత్మక సమీక్ష ఈ అమ్మకంతో ముగిసినట్లయింది. ఈ డీల్‌తో ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్వహణ, యాజమాన్య హక్కులు పూర్తిగా కొత్త కన్సార్టియం చేతికి వెళ్లాయి.



More Telugu News