Nirav Modi: భారత్‌కు అప్పగింత కేసు.. నీరవ్ మోదీకి మరోసారి చుక్కెదురు

UK court rejects Nirav Modis plea to reopen case against extradition
షార్ట్స్‌లో చూడండి
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్‌కు అప్పగించే ప్రక్రియను నిలిపివేసి, కేసు విచారణను తిరిగి ప్రారంభించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను లండన్‌లోని హైకోర్ట్ ఆఫ్ జస్టిస్, కింగ్స్ బెంచ్ డివిజన్ తిరస్కరించింది. ఈ నిర్ణయంతో నీరవ్ మోదీని భారత్‌కు రప్పించే ప్రయత్నాల్లో భారత దర్యాప్తు సంస్థలకు మరో విజయం లభించినట్లయింది.

రక్షణ రంగ మధ్యవర్తి సంజయ్ భండారీ కేసులో యూకే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకుని నీరవ్ మోదీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసులో భారత్‌కు అప్పగిస్తే హింసకు గురయ్యే ప్రమాదం ఉందని భండారీ వాదించగా, మానవతా దృక్పథంతో కోర్టు ఆయన అప్పగింతను నిరాకరించింది. అదే తరహాలో తనను కూడా భారత్‌లో హింసిస్తారని, కాబట్టి తన కేసును కూడా మళ్లీ విచారించాలని నీరవ్ మోదీ కోరారు.

ఈ విచారణ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారుల బృందం లండన్‌కు వెళ్లింది. అక్కడి క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాదులతో కలిసి నీరవ్ మోదీ వాదనలను వ్యతిరేకించింది. కేసును తిరిగి తెరిచేందుకు అవసరమైన అసాధారణ పరిస్థితులు ఏవీ లేవని కోర్టు అభిప్రాయపడింది. పిటిషన్‌లో పేర్కొన్న కారణాలు సరిపోవని, పాత తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణంలో నీరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్న విష‌యం తెలిసిందే. బ్యాంకు పేరుతో నకిలీ గ్యారెంటీలు ఉపయోగించి విదేశాల్లో రుణాలు పొందినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు ప్రారంభం కావడానికి కొద్దిరోజుల ముందే.. 2018 జనవరిలో ఆయన దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత 2019లో యూకేలో అరెస్ట్ కాగా, అప్పటి నుంచి ఆయన అప్పగింతపై న్యాయపోరాటం కొనసాగుతోంది.
Go Back to Shorts
Nirav Modi
PNB scam
Punjab National Bank
India extradition
UK High Court
Sanjay Bhandari
CBI investigation
fraud case
economic offender

More Telugu News