G Parameshwara: ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా మరణించిన ఫ్యాన్స్‌కు అక్కడ స్మారక చిహ్నం

G Parameshwara Unveils Memorial for RCB Fans
షార్ట్స్‌లో చూడండి
గత సంవత్సరం ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది క్రికెట్ అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల ఆ 11 మంది అభిమానులకు గుర్తుగా ఒక స్మారక చిహ్నాన్ని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర ఆవిష్కరించారు. అనంతరం మృతులకు పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం ఆర్సీబీ తొలి ఐపీఎల్ విజయాన్ని పురస్కరించుకొని జరిగిన వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది యువకులు దుర్మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. దీనితో ప్రభుత్వం స్పందించి, అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు.

మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, తాను పరామర్శించినట్లు తెలిపారు. జరగకూడని విషాదం చోటు చేసుకుందని అన్నారు. ఈ తొక్కిసలాట నేపథ్యంలో ప్రభుత్వం జస్టిస్ మైఖేల్ డికున్హా కమిషన్‌ను నియమించిందని తెలిపారు. ఈ నివేదిక చేసిన సిఫార్సులను అమలు చేయాలని సంబంధిత శాఖలకు, ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిషన్ స్వల్పకాలిక, దీర్ఘకాలిక సిఫార్సులను నివేదికలో పొందుపరిచిందని తెలిపారు. అలాగే అభిమానుల జ్ఞాపకార్థం స్మారకచిహ్నాన్ని నిర్మించిన కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మార్చి 28న ఇదే వేదికపై మ్యాచ్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ మ్యాచ్ కోసం అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, ఆర్సీబీ వ్యవహరించాలని సూచించారు. ఇవి జవాబుదారీగా ఉండాలని అన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగినంత సిబ్బందిని మోహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించినట్లు తెలిపారు. అభిమానులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. మితిమీరిన ఉత్సాహం సరికాదని సూచించారు.
Go Back to Shorts
G Parameshwara
RCB
Royal Challengers Bangalore
Chinnaswamy Stadium
Karnataka
IPL
cricket fans

More Telugu News