Harish Rao: రేవంత్ రెడ్డికి దమ్ముంటే నాపై పోటీకి రావాలి: హరీశ్ రావు సవాల్

Harish Rao Challenges Revanth Reddy to Contest Against Him
షార్ట్స్‌లో చూడండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటున్నారని, ఆయన తల్లకిందులుగా తపస్సు చేసినా అది అసాధ్యమని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి ఎప్పుడు, ఎలా గోల్ కొట్టాలో బాగా తెలుసని, సమయం వచ్చినప్పుడు బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే వేరే వాళ్లను పంపడం కాకుండా, నేరుగా సిద్దిపేటలో తనపై పోటీకి రావాలని బహిరంగ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు రైతులను కూడా దారుణంగా మోసం చేసిందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ సర్కారుపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని ఆయన విశ్లేషించారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశాలపై స్పందిస్తూ, తాము ఈ మార్పులను స్వాగతిస్తున్నామని తెలిపారు. పునర్విభజన వల్ల భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకే రాజకీయంగా మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, కుటుంబ నియంత్రణను పక్కాగా పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో, నిధుల్లో అన్యాయం జరగడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారనే ప్రచారంపై హరీశ్ రావు ఆసక్తికరంగా స్పందించారు. ఆయన వస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కంటే, వేచి చూస్తేనే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

Go Back to Shorts
Harish Rao
Revanth Reddy
BRS
Telangana Politics
Siddipet
Telangana Elections
KCR
Congress Party
BC SC ST Minorities
Constituency Reorganisation

More Telugu News