Nilesh Kurmi: పక్కా ప్లాన్ తో భార్యను చంపేసిన డాక్టర్

Doctor Nilesh Kurmi Murders Wife Over Affair in Madhya Pradesh
షార్ట్స్‌లో చూడండి
మధ్యప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం బయటపడటంతో కట్టుకున్న భార్యనే ఓ డాక్టర్ అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అనంతరం ఆ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. సాగర్ జిల్లాకు చెందిన డాక్టర్ నీలేష్ కుర్మి తన భార్య సీమా కుర్మి(38)ని చంపి, కారులో ఆమె మృతదేహంతో పాటు దహనం చేశాడు. ఈ కేసులో డాక్టర్‌తో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. మార్చి 21వ తేదీ తెల్లవారుజామున 4 గంటల సమయంలో సాగర్-గర్హకోట రహదారిపై ఓ కారు పూర్తిగా దగ్ధమై అందులో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. విచారణ చేపట్టిన పోలీసులకు ఇది ప్రమాదం కాదని, పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని తేలింది. సాగర్ ఏఎస్పీ లోకేష్ సింగ్ కథనం ప్రకారం.. నీలేష్‌కు తన క్లినిక్‌కు వచ్చే ఓ యువతితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భార్య సీమాకు తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే భార్యను అడ్డు తొలగించుకోవాలని నీలేష్ నిర్ణయించుకున్నాడు.

ఘటన జరిగిన రోజు రాత్రి భార్యతో గొడవపడి ఆమెను గొంతు నులిమి చంపాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక, హత్యను కప్పిపుచ్చుకునేందుకు పథకం వేశాడు. వైద్యుడు కావడంతో, మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తే గొంతుపై ఉన్న గుర్తుల వల్ల హత్య విషయం బయటపడుతుందని భావించాడు. దీంతో తన ఇంట్లో అద్దెకుంటున్న రామ్‌కృష్ణ పటేల్, శుభం పటేల్‌లను పిలిచి, తన భార్యకు గుండెపోటు వచ్చిందని నమ్మించి వారి సహాయంతో ఆమె మృతదేహాన్ని కారులో ఎక్కించాడు. అనంతరం కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు తొలుత ప్రమాదం జరిగిందని, సీఎన్‌జీ కిట్ పేలిందని వేర్వేరు కథలు చెప్పాడు. అయితే, ఘటనా స్థలంలోని ఆధారాలు, అతని పొంతనలేని మాటలతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. సనోధా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, నిందితులను విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరణానికి కచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Nilesh Kurmi
Madhya Pradesh
wife murdered
extra marital affair
crime news
Sagar district
doctor arrested
murder investigation
crime scene
Ramkrishna Patel

More Telugu News