రైతులకు శుభవార్త... రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద సాగుకు ఆర్థిక సాయం అందించేందుకు తొలి విడత నిధులను విడుదల చేసింది. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.3,590 కోట్లను విడుదల చేశారు. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో, ఈ మొత్తం సోమవారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ప్రభుత్వం తెలిపింది.

రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు గాను రూ.9,000 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా మొదటి విడతను విడుదల చేయగా, మరో 20 రోజుల్లో రెండో విడతగా రూ.2,650 కోట్లు, ఆ తర్వాత మరో 20 రోజుల్లో మిగిలిన రూ.2,760 కోట్లను విడుదల చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు ఎకరానికి ఏటా రూ.12,000 చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, రైతుల సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి నెలకు రూ.2,533 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం నెలకు రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల కళ్లలో ఆనందం చూడటమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. పంట నష్టపోయిన రైతులకు కూడా పరిహారం అందిస్తున్నామని చెప్పారు.

వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం వెల్లడించారు. ఈ సీజన్‌లో ప్రభుత్వం 71 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిందని, అయితే కేంద్ర ప్రభుత్వం 50 లక్షల టన్నులకు మించి కొనుగోలు చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు. రైతులు వరికే పరిమితం కాకుండా పంట మార్పిడిపై దృష్టి సారించాలని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులు పండించే అన్ని పంటలకు లాభాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.


More Telugu News