కవలల పెళ్లిలో విషాదం.. నెల తిరగకముందే నవ వరుడు ఆత్మహత్య
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కవలల పెళ్లిలో విషాదం.. నెల తిరగకముందే నవ వరుడు ఆత్మహత్య

Vinay Kumar Commits Suicide Month After Twin Wedding in Telangana
  • కవల సోదరీమణులను పెళ్లి చేసుకున్న కవల సోదరులలో ఒకరు ఆత్మహత్య
  • పెళ్లయిన నెల రోజుల్లోనే కామారెడ్డి జిల్లాలో ఈ విషాద ఘటన
  • ఉగాది రోజున అదృశ్యమైన వినయ్ కుమార్, మానేరు వాగులో శవంగా గుర్తింపు
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం కవల సోదరీమణులను వివాహం చేసుకొని వార్తల్లో నిలిచిన కవల సోదరులలో ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెళ్లయిన నెల రోజులు కూడా గడవకముందే ఈ ఘోరం జరగడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర శోకం నెలకొంది.

వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ గ్రామానికి చెందిన డుంపటి వినయ్ కుమార్ (31), విజయ్ కుమార్ కవల సోదరులు. వినయ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీరికి తడ్వాయి మండలం దేమి కలాన్‌కు చెందిన కవల సోదరీమణులు కీర్తి, కీర్తనలతో గత నెల ఫిబ్రవరి 22న 'ట్విన్స్ డే' రోజున వివాహం జరిగింది. వినయ్.. కీర్తిని, విజయ్.. కీర్తనను పెళ్లాడారు. ఈ అరుదైన వివాహం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే, ఉగాది పండుగ రోజున ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వినయ్ కుమార్ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో, పొరుగున ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల వద్ద మానేరు వాగులో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు విచారణ చేపట్టగా, అది వినయ్ కుమార్ మృతదేహంగా గుర్తించారు.

వినయ్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, పెళ్లయిన కొద్ది రోజులకే అతను ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సంతోషంగా సాగుతుందనుకున్న వారి జీవితంలో ఇంతటి విషాదం చోటుచేసుకోవడం గ్రామస్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
Advertisement
Vinay Kumar
Kamareddy
Twin marriage
Suicide
Telangana
Ghanpur
Software engineer
Maneru vagu

More Telugu News