KTR: 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా, వాటికి చట్టబద్ధమైన హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే శుక్రవారం అసెంబ్లీలో తాము 'ప్రైవేట్ మెంబర్ బిల్లు' ప్రవేశపెట్టబోతున్నామని, దీనికి అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నామని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన రోజే 6 గ్యారెంటీల ఫైలుపై సంతకం చేశారని, గవర్నర్ ప్రసంగంలో కూడా ఇదే చెప్పించారని... కానీ ఇప్పుడు ఆ ఫైలు ఎక్కడుందో తెలియడం లేదని కేటీఆర్ ఆరోపించారు. ఈ బిల్లు చట్టంగా మారితే... మహిళలకు రావాల్సిన రూ.2,500, రైతులకు రూ.15,000 రైతు భరోసా, విద్యార్థులకు విద్యా భరోసా వంటివి ప్రజల హక్కుగా మారుతాయని, ప్రభుత్వం ఎగ్గొట్టే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా బీజేపీ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును ఆమోదించి చట్టం చేసిన దాఖలాలు ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా ఆరు గ్యారెంటీల్లో కనీసం 'అర' గ్యారెంటీ కూడా సరిగ్గా అమలు కాలేదని, 4 కోట్ల మంది ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందని ఎద్దేవా చేశారు.