Padi Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్థానిక బీఆర్ఎస్ నేతల తిరుగుబాటు..?
హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయం మరోసారి హీటెక్కింది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇప్పుడు పార్టీని వీడేందుకు సిద్ధమైంది. నిన్న రాత్రి జమ్మికుంటలో సుమారు వంద మందికి పైగా బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు అత్యవసరంగా రహస్య సమావేశం నిర్వహించడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ఈ సమావేశానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కౌశిక్ రెడ్డి పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్న వారిని విస్మరిస్తున్నారంటూ నేతలు ఈ భేటీలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత అజెండాను అమలు చేస్తూ పార్టీ ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం సాధ్యం కాదని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఈ అసమ్మతి సెగ ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల వైపు దారితీస్తోంది. సమావేశమైన నేతల్లో మెజారిటీ సభ్యులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లా మంత్రి, కాంగ్రెస్ ముఖ్య నేతలతో వీరు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి, హుజూరాబాద్‌లో జరుగుతున్న ఈ పరిణామాలు పెద్ద ఊరటనిస్తున్నాయి. త్వరలోనే భారీ సంఖ్యలో కౌశిక్ రెడ్డి వ్యతిరేక వర్గం హస్తం గూటికి చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.