Bandi Sanjay: కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో నేడు ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత శనివారం నిర్వహించిన 'అంజన్న ఆశీర్వాద యాత్ర' ముగింపు సమయానికి ఆలయం మూసివేయడంతో, అప్పట్లో ఆయన ముఖద్వారం వద్దే మొక్కు తీర్చుకున్నారు. ఆ వెలితిని పూడ్చుకుంటూ నేడు మళ్ళీ ఆలయానికి విచ్చేశారు.
అర్చకులు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గర్భాలయంలో పూజల అనంతరం బండి సంజయ్‌ను శాలువాతో సన్మానించి ఆశీర్వచనాలు, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు, బీజేపీ నేతలు ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.