ఐపీఎల్ ప్రారంభానికి ముందు కోల్ కతా నైట్ రైడర్స్ కు మరో ఎదురుదెబ్బ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ఆరంభానికి ముందే మూడుసార్లు ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక ఫాస్ట్ బౌలర్, టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఇప్పటికే పేస్ బౌలింగ్ వనరుల కొరతతో ఇబ్బంది పడుతున్న కేకేఆర్ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి.

గత ఏడాది జరిగిన మినీ వేలంలో ఆకాశ్ దీప్‌ను కోల్‌కతా యాజమాన్యం రూ.1 కోటి కనీస ధరకు కొనుగోలు చేసింది. అయితే, వెన్నునొప్పి (స్ట్రెస్ రియాక్షన్) కారణంగా అతడు ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆడటం లేదని ఫ్రాంచైజీ వర్గాలు శనివారం స్పష్టం చేశాయి. రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా అతడు ఈ గాయం బారినపడినట్లు తెలుస్తోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 12 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. మార్చి 18న కోల్‌కతాలో ప్రారంభమైన జట్టు ప్రీ-సీజన్ క్యాంపునకు కూడా ఆకాశ్ హాజరు కాలేదు.

ఇప్పటికే కేకేఆర్ బౌలర్లు హర్షిత్ రాణా సర్జరీతో, శ్రీలంక పేసర్ మతీశ పతిరణ భుజం గాయంతో జట్టుకు దూరమయ్యారు. పతిరణ ఆడే విషయంపై శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఇంకా అనుమతి రాలేదు. తాజా పరిణామంతో కేకేఆర్ పేస్ బౌలింగ్ విభాగం మరింత బలహీనపడింది. ప్రస్తుతం జట్టులో వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, బ్లెస్సింగ్ ముజరబానీ, కార్తీక్ త్యాగి మాత్రమే స్పెషలిస్ట్ పేసర్లుగా ఉన్నారు.

ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసేందుకు కేకేఆర్ యాజమాన్యం ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్‌లో ట్రయల్స్ నిర్వహిస్తోంది. నవదీప్ సైనీ, ఆకాశ్ మధ్వాల్, సిమర్‌జీత్ సింగ్ వంటి బౌలర్లను పరిశీలిస్తోంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.


More Telugu News