పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. 9 దేశాల గగనతలాన్ని వాడొద్దన్న డీజీసీఏ
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానయాన సంస్థలకు డీజీసీఏ హెచ్చరిక
- ఇరాన్, యూఏఈ సహా 9 దేశాల గగనతలాన్ని వాడొద్దని కఠిన ఆదేశాలు
- ఒమన్, సౌదీ అరేబియాలో 32,000 అడుగుల ఎత్తులో ప్రయాణానికి షరతులతో అనుమతి
- మార్చి 28 వరకు తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
ఇరాన్ భూభాగంలో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు నిర్వహించడం, దీనికి ప్రతిగా ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉండటంతో పౌర విమానయానానికి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని డీజీసీఏ తన ఆదేశాల్లో పేర్కొంది. సైనిక ఘర్షణల సమయంలో పొరపాటున పౌర విమానాలను శత్రు విమానాలుగా గుర్తించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
డీజీసీఏ ఆదేశాల ప్రకారం.. బహ్రెయిన్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైత్, లెబనాన్, ఖతార్, యూఏఈ గగనతలాల్లో అన్ని ఎత్తులలోనూ విమానాలు నడపవద్దు. అయితే, ఒమన్, సౌదీ అరేబియా గగనతలంలో మాత్రం కనీసం 32,000 అడుగుల ఎత్తులో ప్రయాణించేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, మార్చి 28 వరకు కొనసాగుతాయని డీజీసీఏ వెల్లడించింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని, అత్యవసర ప్రణాళికలు అమలు చేయాలని సూచించింది. ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను దారి మళ్లిస్తుండటంతో ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉంది.