Supreme Court: ఇంటి పనులు చేయడం లేదని విడాకులా?.. భర్త పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం

Supreme Court Expresses Displeasure Over Divorce Plea Citing Wife Not Doing Housework
షార్ట్స్‌లో చూడండి
భార్య అంటే కేవలం ఇంటి పనులకే పరిమితమయ్యే వ్యక్తి కాదని, ఆమె సమాన గౌరవం పొందాల్సిన జీవిత భాగస్వామి అని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భార్య ఇంటి పనులు చేయడం లేదని, ఇది క్రూరత్వం కిందకు వస్తుందని ఆరోపిస్తూ ఓ భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

విచారణలో భాగంగా "మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనలు మారాలి. వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులను భార్య ఒక్కరే చేయాలన్న అంచనాలు ఈ కాలానికి సరిపోవు. మీరు పెళ్లి చేసుకున్నది సేవకురాలిని కాదు, జీవిత భాగస్వామిని. ఇంటి పనులను ఇద్దరూ సమానంగా పంచుకోవాలి" అని ధర్మాసనం హితవు పలికింది.

ఈ కేసులో భర్త ఉపాధ్యాయుడు కాగా, భార్య లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. విద్యావంతులైన వారు ఇలాంటి చిన్న కారణాలతో విడిపోవడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ, బిడ్డ భవిష్యత్తు కోసం గతాన్ని మరిచి కలిసి ఉండాలని సూచించింది.

ఇప్పటికే ఒకసారి వీరి మధ్య మధ్యవర్తిత్వం విఫలమైనప్పటికీ, బంధాన్ని నిలబెట్టేందుకు మరో ప్రయత్నంగా ఏప్రిల్ 27న తమ ముందు హాజరుకావాలని దంపతులను ఆదేశించింది.
Go Back to Shorts
Supreme Court
Divorce Petition
Wife
Husband
Justice Vikram Nath
Justice Sandeep Mehta
Domestic Work
Matrimonial Dispute
India
Family Court

More Telugu News