Bandi Sanjay: భ్రష్టు పట్టించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టింది: బడ్జెట్ పై బండి సంజయ్

Bandi Sanjay Slams Revanth Reddy Government Hat Trick in Ruining Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. తెలంగాణ బడ్జెట్‌పై ఆయన స్పందించారు. అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ఏమీలేదని అన్నారు. ఆదాయాన్ని రాకుండా చేసి, అప్పులకోసం అర్రులు చాచే బడ్జెట్‌గా కనిపిస్తోందని విమర్శించారు.

రైతు భరోసా డబ్బులు రెండు విడతలుగా ఎగ్గొట్టినట్లే అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఇప్పటికీ అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యకు 16 శాతం నిధులు కేటాయించాలని విద్యా శాఖ కమిషన్ ప్రతిపాదిస్తే కేవలం 8 శాతమే కేటాయించారని అన్నారు. ఆరోగ్యశ్రీ బడ్జెట్‌కు కేటాయింపుల కంటే గత బకాయిలే ఎక్కువగా ఉన్నాయని చురక అంటించారు.

దేవాదాయ శాఖకు గత బడ్జెట్‌లో రూ.190 కోట్లు కేటాయిస్తే, ఈసారి ఆ ప్రస్తావన లేదని అన్నారు. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు కేటాయింపులు తూతూమంత్రంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. 56 శాతం బీసీ జనాభాకు నాలుగు శాతం కేటాయింపులు విడ్డూరమని బండి సంజయ్ అన్నారు. రెండేళ్లలో దిగిపోయే ప్రభుత్వమే కదా అని, ఇష్టారాజ్యంగా అప్పులు చేసేందుకు సిద్ధపడ్డట్లుగా ఈ బడ్జెట్ కనిపిస్తోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ అప్పుల బాగోతాన్ని బయటకు తీసుకువచ్చి విచారణ చేపడతామని అన్నారు.
Go Back to Shorts
Bandi Sanjay
Telangana Budget
Revanth Reddy Government
Telangana
Congress Government

More Telugu News