జొమాటోలో ఫుడ్ ఆర్డర్ మరింత భారం... పెరిగిన ప్లాట్‌ఫామ్ ఫీజు

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తన యూజర్లపై మరోసారి భారం మోపింది. ప్రతి ఆర్డర్‌పై వసూలు చేసే ప్లాట్‌ఫామ్ ఫీజును 19.2 శాతం పెంచింది. ఈ కొత్త పెంపుతో ఒక్కో ఆర్డర్‌పై ఛార్జీ రూ. 2.40 పెరిగింది. శుక్రవారం నుంచి జొమాటో యాప్‌లో ఈ మార్పులు కనిపించాయి.

తాజా పెంపుతో జీఎస్టీకి ముందు ప్లాట్‌ఫామ్ ఫీజు రూ. 12.50 నుంచి రూ. 14.90కి చేరింది. పెరిగిన ఎల్పీజీ, ముడిచమురు ధరల కారణంగా రెస్టారెంట్లు, డెలివరీ పార్ట్‌నర్ల నిర్వహణ వ్యయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే మార్జిన్లు, యూనిట్ ఎకనామిక్స్‌ను మెరుగుపరచుకోవడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జొమాటో 2023 ఆగస్టులో తొలిసారి ఆర్డర్‌పై రూ. 2 ప్లాట్‌ఫామ్ ఫీజును ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి దశలవారీగా పెంచుతూ వస్తోంది. గతేడాది సెప్టెంబర్ 2025లో చివరిసారిగా ఫీజును సవరించింది. అంతకుముందు ఫిబ్రవరిలో పండుగల సీజన్‌లో ఫీజును రూ. 6 నుంచి రూ. 10కి పెంచింది. జొమాటోకు పోటీగా ఉన్న స్విగ్గీ ప్రస్తుతం పన్నులతో కలిపి ప్రతి ఆర్డర్‌పై రూ. 14.99 ప్లాట్‌ఫామ్ ఫీజు వసూలు చేస్తోంది.

ఇదిలా ఉండగా, జొమాటో మాతృ సంస్థ 'ఎటర్నల్' షేరు శుక్రవారం 1.86 శాతం లాభపడి రూ. 233 వద్ద ముగిసింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 72.88 శాతం పెరిగి రూ. 102 కోట్లకు చేరినట్లు ప్రకటించింది.


More Telugu News