'ది బ్లాక్ గోల్డ్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంయుక్త మీనన్

నటి సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'ది బ్లాక్ గోల్డ్' షూటింగ్ శరవేగంగా తుది దశకు చేరుకుంది. యోగేశ్ కేఎంసీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది జూన్ లేదా జూలైలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత రాజేశ్ దండా వెల్లడించారు.

ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన సినిమా విశేషాలు పంచుకున్నారు. "గన్ పట్టుకున్న పోలీస్ ఆఫీసర్‌కు, గన్ మాత్రమే వాడే విలన్‌కు మధ్య జరిగే కథ ఇది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నాం. సంయుక్త కెరీర్‌లో ఇది చాలా కొత్త తరహా పాత్ర అవుతుంది" అని ఆయన వివరించారు. సినిమాకు సంబంధించి ఇంకా ఐదు రోజుల టాకీ పార్ట్ మాత్రమే మిగిలి ఉందని, పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయని తెలిపారు.ః

ఈ చిత్రంలో సంయుక్త మీనన్ ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఓ పవర్‌ఫుల్, ఫియర్స్ కాప్ అవతార్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన ఆమె పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. హస్య మూవీస్, మగంటి పిక్చర్స్ పతాకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇందులో మురళీ శర్మ, రావు రమేశ్, నాజర్, మనీష్ వాధ్వా, రాంకీ వంటి భారీ తారాగణం నటిస్తోంది. రొటీన్ యాక్షన్ డ్రామాలకు భిన్నంగా, సరికొత్త కథనం, ఊహించని మలుపులతో ఈ సినిమా ఉండనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. శామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


More Telugu News