‘ధురంధర్ 2’ తెలుగు ఫ్యాన్స్‌కు షాక్.. చివరి నిమిషంలో ప్రీమియర్ షోలు రద్దు

రణవీర్ సింగ్ హీరోగా నటించిన భారీ అంచనాల చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ తెలుగు ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్ షోలు చివరి నిమిషంలో రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బుధవారం సాయంత్రం ప్రదర్శించాల్సిన తెలుగు వెర్షన్ షోలను పలు థియేటర్లు రద్దు చేసి, టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు వాపసు చేస్తున్నాయి.

గతేడాది విడుదలైన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దీనికి కొనసాగింపుగా వస్తున్న ‘ధురంధర్ 2’పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తొలి భాగాన్ని కేవలం హిందీలో రిలీజ్ చేయగా, ఈ సీక్వెల్‌ను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం, ఒకరోజు ముందుగా ఇవాళ‌ పెయిడ్ ప్రీమియర్లు ప్లాన్ చేశారు.

అయితే, చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కంటెంట్ డెలివరీలో ఆలస్యం కారణంగా తెలుగు, తమిళ వెర్షన్ల ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు థియేటర్ల యాజమాన్యాలు షోలు రద్దయినట్లు మెసేజ్‌లు పంపించి, టికెట్ డబ్బులను రిఫండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో చాలామంది తమకు రిఫండ్ మెసేజ్‌లు వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు.

అయితే, హిందీ వెర్షన్ ప్రీమియర్లు మాత్రం యథాతథంగా ప్రదర్శితమవుతున్నాయి. ఇక, రేప‌టి నుంచి హిందీతో పాటు తెలుగులోనూ రెగ్యులర్ షోలు ప్రదర్శించబడతాయని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమాచారం. ఈ సినిమాలో రణవీర్ సింగ్‌తో పాటుగా ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సుమారు 3 గంటల 49 నిమిషాల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.


More Telugu News