Char Dham Yatra: ఛార్ ధామ్ యాత్ర... యూట్యూబర్లపై ఆంక్షలు

Char Dham Yatra Restrictions on YouTubers Mobile Phones
షార్ట్స్‌లో చూడండి
ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న చార్‌ధామ్ యాత్రకు బద్రీనాథ్ -కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) కీలకమైన కొత్త నిబంధనలను ఆమోదించింది. ఆలయాల పవిత్రతను కాపాడటం, భక్తులకు సాఫీగా దర్శనం కల్పించడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం, ఆలయాల గర్భగుడిలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలను పూర్తిగా నిషేధించారు. యూట్యూబర్లు, సోషల్ మీడియా వ్లాగర్ల కార్యకలాపాలపై కూడా కఠిన ఆంక్షలు విధించారు.

గత యాత్రల అనుభవాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు కమిటీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది తెలిపారు. కొందరు భక్తులు, వ్లాగర్లు దర్శనం కంటే ఫోటోలు, వీడియోలు తీయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టడంతో క్యూలైన్లు నెమ్మదిస్తున్నాయని, ఇతర భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో, భక్తులు దర్శనానికి వెళ్లే ముందు తమ ఫోన్లు, కెమెరాలను ఆలయం బయట ఏర్పాటు చేసే ప్రత్యేక లాకర్లలో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఈ నిబంధన తనతో సహా అందరికీ వర్తిస్తుందని కమిటీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది స్పష్టం చేశారు.

మరో వైపు చార్‌ధామ్‌కు వచ్చే భక్తుల సంఖ్య ఈసారి కూడా పెరుగుతోందని, రెండు రోజుల్లోనే 6 లక్షలకుపైగా పేర్లు నమోదు చేసుకున్నారని కమిటీ పేర్కొంది. యాత్ర ఏర్పాట్ల కోసం రూ.121 కోట్ల బడ్జెట్‌కు కమిటీ ఆమోదం తెలిపింది. కాగా, చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 19న అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయాల ప్రారంభంతో మొదలవుతుంది. ఏప్రిల్ 22న కేదార్‌నాథ్, ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి.
 
Go Back to Shorts
Char Dham Yatra
Badrinath
Kedarnath
Badrinath Kedarnath Temple Committee
BKTC
Yatra Guidelines
Hemant Dwivedi
Gangotri
Yamunotri
Hindu Pilgrimage

More Telugu News