Kakinada Tiger: ఈ పులి చాలా తెలివిగా వ్యవహరిస్తోంది... ఎంత ప్రయత్నించినా దొరకడంలేదు: కాకినాడ డీఎఫ్ఓ

Tiger Roaming in Kakinada District Challenges Forest Officials
షార్ట్స్‌లో చూడండి
కాకినాడ జిల్లాలో సంచరిస్తున్న ఓ పెద్దపులి అటవీ శాఖ అధికారులకు సవాల్ గా మారింది. దాన్ని బంధించేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది తప్పించుకు తిరుగుతోందని, చాలా చురుగ్గా, తెలివిగా వ్యవహరిస్తోందని కాకినాడ డీఎఫ్‌ఓ రామచంద్రరావు స్వయంగా పేర్కొనడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అధికారులకు సవాలుగా మారిన ఈ పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ఏకంగా 11 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.

గత కొన్ని రోజులుగా శంఖవరం మండలంలో తిరుగుతున్న ఈ పులి, స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఆదివారం రాత్రి ఓ గేదె దూడపై దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత సోమవారం దాదాపు 12 కిలోమీటర్లు ప్రయాణించి అన్నవరం సమీపంలోని ఓ మండపం వద్ద కనిపించింది. శాటిలైట్ రేడియో కాలర్ ద్వారా పులి కదలికలను అధికారులు నిరంతరం గమనిస్తున్నారు. ప్రస్తుతం ఈ పులి శంఖవరం మండలంలోని గౌరంపేట కొండపైనే తిష్ట వేసినట్లు గుర్తించారు.

పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర అటవీ దళాల అధిపతి డాక్టర్ పి.వి. చలపతిరావు స్వయంగా ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. పులిని బంధించేందుకు 11 హనుమాన్ బృందాలు, 3 మత్తుమందు ఇచ్చే బృందాలు (ట్రాంక్విలైజింగ్), 4 ఆర్‌ఆర్‌ఆర్‌టీ బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. కాకినాడ డీఎఫ్ఓ రామచంద్రరావు నేతృత్వంలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.

పులిని సురక్షితంగా తిరిగి అడవిలోకి పంపడమే తమ మొదటి ప్రాధాన్యత అని అధికారులు తెలిపారు. ఒకవేళ అది సాధ్యపడకపోతే, మత్తుమందు ఇచ్చి బంధించి పాపికొండ నేషనల్ పార్క్ వంటి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని వివరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా బయట తిరగవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అడవులు వదిలి పులులు జనావాసాల్లోకి రావడం ఇటీవల కాలంలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Kakinada Tiger
Tiger Kakinada
Andhra Pradesh Tiger
Shankavaram Mandal
Forest Department
Pilli
Tiger News
Wildlife Andhra Pradesh
Papikonda National Park
Ramachandra Rao DFO

More Telugu News