భవానీపూర్ బరిలో మమత... మరోసారి దీదీ - సువేందు అధికారి పోరు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో, బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి, మమతకు మధ్య మరోసారి హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పేరును కాషాయదళం అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు మమతా కూడా ఇదే స్థానం నుంచి బరిలో దిగుతుండడంతో అందరి దృష్టి భవానీపూర్ నియోజకవర్గంపైనే ఉండనుంది.

గత 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచి పోటీ చేయగా, సువేందు అధికారి ఆమెపై సుమారు 2,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు మమత... భవానీపూర్ నుంచి ఉపఎన్నికలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు సువేందు అధికారి నేరుగా భవానీపూర్‌లోనే ఆమెతో తలపడనుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.

రాబోయే ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 291 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను మమత విడుదల చేశారు. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో, డార్జిలింగ్ పరిధిలోని 3 స్థానాలను మిత్రపక్షమైన బీజీపీఎంకు కేటాయించారు.

ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ 226 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలోని కీలక అధికారులను బదిలీ చేయడం దీనికి నిదర్శనమని ఆరోపించారు. బీజేపీ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర చేస్తోందని, ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎన్నికల సంఘానిదే బాధ్యత అని హెచ్చరించారు. టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదలతో బెంగాల్ ఎన్నికల రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.







More Telugu News