Chandrababu Naidu: రాష్ట్రంలో ఎల్పీజీ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Assures No LPG Panic in Andhra Pradesh
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్ యుద్ధ ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరా, నిల్వల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమరావతి నుంచి ఆర్టీజీఎస్ ద్వారా వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్పీజీ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్‌లకు చెందిన 1,154 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోందని, 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్యాస్ డెలివరీ సమయంలో సిలిండర్ల దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందేలా చూడాలని స్పష్టం చేశారు. సిలిండర్ సరఫరా సమయాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని సూచించారు.

అన్న క్యాంటీన్ల కిచెన్లకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలపగా.. ఆసుపత్రులు, పాఠశాలలు, దేవాలయాల్లో రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్పీజీ వినియోగాన్ని తగ్గించే దిశగా హోటళ్ల అసోసియేషన్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్రం నుంచి అదనపు ఎల్పీజీ కేటాయింపులు జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్ గ్యాస్, ఇండక్షన్ స్టవ్‌ల వాడకాన్ని ప్రోత్సహించే అంశాన్ని పరిశీలించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇకపై రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్‌లు, సరఫరాపై ప్రతిరోజూ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
LPG
Gas supply
LPG shortage
cooking gas
gas cylinders
black market
IOCL
BPCL

More Telugu News