Potti Sriramulu: పొట్టి శ్రీరాములు గురించి గాంధీ వ్యాఖ్యలను గుర్తు చేసిన పవన్ కల్యాణ్
అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ వేడుక తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచింది. ఈ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... "శ్రీరాములు లాంటి వారు 11 మంది ఉంటే చాలు, ఒక ఏడాదిలోనే దేశానికి స్వాతంత్ర్యం తీసుకురాగలను" అని గాంధీజీ అన్నారంటే, ఆయన సంకల్ప బలం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చని కొనియాడారు. రాజధాని ప్రాంతంలో ఇంతటి మహోన్నతమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భావితరాలకు మన చరిత్రను అందించినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల త్యాగాల వల్లే మనకు స్వేచ్ఛ లభించిందని ఆయన తెలిపారు. తాను పొట్టి శ్రీరాములు గారిని ప్రత్యక్షంగా కలిసే అవకాశం పొందలేదని, అయితే వారి కుటుంబ సభ్యులను చూడటం ద్వారా వారి త్యాగాలను గుర్తు చేసుకునే అవకాశం లభించిందని పవన్ అన్నారు. అమరావతి నడిబొడ్డున పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన మంత్రి నారా లోకేశ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.