సీఎస్ తర్వాత డీజీపీ.. బెంగాల్ పాలనాయంత్రాంగంపై ఈసీ పూర్తి పట్టు

పశ్చిమ బెంగాల్‌లో స్వేచ్ఛాయుత, శాంతియుత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీలను బదిలీ చేసిన మరుసటి రోజే, పోలీసు శాఖలోనూ భారీ మార్పులు చేసింది. రాష్ట్ర యాక్టింగ్ డీజీపీ పీయూష్ పాండే, కోల్‌కతా పోలీస్ కమిషనర్ సుప్రతిమ్ సర్కార్‌లను తక్షణమే ఆ పదవుల నుంచి తొలగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నూతన డీజీపీగా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సిద్ధ్ నాథ్ గుప్తాను, కోల్‌కతా నూతన పోలీస్ కమిషనర్‌గా 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అజయ్ కుమార్ నంద్‌ను ఈసీ నియమించింది. వీరితో పాటు లా అండ్ ఆర్డర్ డీజీగా ఉన్న వినీత్ కుమార్ గోయల్‌ను కూడా తొలగించి, ఆయన స్థానంలో 1995 బ్యాచ్ అధికారి అజయ్ ముకుద్ రానడేను అదనపు డీజీగా (లా అండ్ ఆర్డర్) నియమించారు. మరోవైపు, 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి నటరాజన్ రమేశ్ బాబును డైరెక్టర్ జనరల్ ఆఫ్ కరెక్షనల్ సర్వీసెస్‌గా పోస్టింగ్ ఇచ్చారు.

బెంగాల్‌లో ఎన్నికలను హింసారహితంగా నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం జనవరి 30న నియమితులైన పాండే, సర్కార్‌లను రెండు నెలలు కూడా గడవకముందే మార్చడం గమనార్హం. ఆదివారం రాత్రి చీఫ్ సెక్రటరీ నందినీ చక్రవర్తి, హోం సెక్రటరీ జగదీశ్ ప్రసాద్ మీనాలను కూడా ఈసీ బదిలీ చేసి, వారి స్థానంలో దుష్యంత్ నరియాల, సంఘమిత్ర ఘోష్‌లను నియమించింది.

కాగా, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు.


More Telugu News