ఇంట్లో పైప్డ్ గ్యాస్ ఉందా?.. ఎల్పీజీ కనెక్షన్ వెంటనే సరెండర్ చేయాల్సిందే!
- ఎల్పీజీ కనెక్షన్లు సరెండర్ చేయాలని కేంద్రం ఆదేశం
- ఇకపై వారికి ఎల్పీజీ సిలిండర్ రీఫిల్స్, కొత్త కనెక్షన్లు నిలిపివేత
- అంతర్జాతీయంగా సరఫరాలో అంతరాయాల కారణంగానే ఈ నిర్ణయం
- పీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతాలకు సిలిండర్లను మళ్లించడమే ప్రభుత్వ లక్ష్యం
కొత్త నిబంధనల ప్రకారం, పీఎన్జీ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఇకపై ఎల్పీజీ సిలిండర్ రీఫిల్స్ పొందలేరు. అలాగే, కొత్త ఎల్పీజీ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా అనర్హులు. "పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఉన్న ఏ వ్యక్తి కూడా డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్ కలిగి ఉండరాదు లేదా రీఫిల్స్ తీసుకోరాదు. అలాంటి వారు వెంటనే తమ ఎల్పీజీ కనెక్షన్‌ను సరెండర్ చేయాలి" అని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా మార్గాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్‌కు ఎల్పీజీ దిగుమతులపై తీవ్ర ప్రభావం పడి, దేశంలో సిలిండర్లపై ఒత్తిడి పెరిగింది. ప్రజలు ఆందోళనతో సాధారణం కంటే 60 శాతం అధికంగా సిలిండర్లను బుక్ చేసుకుంటున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పీఎన్జీ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాలకు, కుటుంబాలకు ఎల్పీజీ సిలిండర్లను మళ్లించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.