India Visa: 30 రోజుల వీసా పొడిగింపు.. విదేశీయులకు గుడ్ న్యూస్ చెప్పిన భారత్
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం విదేశీయులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలగడంతో భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయుల కోసం వీసా గడువు పెంపు, జరిమానాల మినహాయింపును ప్రకటించింది.
దుబాయ్‌లోని భారత కాన్సులేట్ వెల్లడించిన వివరాల ప్రకారం, గడువు ముగిసిన లేదా త్వరలో ముగియనున్న వీసాలు, ఈ-వీసాలను ఉచితంగా ఒక నెల పాటు పొడిగించనున్నారు. ఫిబ్రవరి 28 తర్వాత యుద్ధం కారణంగా అనివార్యంగా భారత్‌లో ఉండిపోయిన విదేశీయులకు ఓవర్‌స్టే పెనాల్టీని కూడా పూర్తిగా మినహాయించారు. ప్రయాణ మార్గాలు పునరుద్ధరించిన తర్వాత వారు తిరిగి వెళ్ళడానికి అవసరమైన ఎగ్జిట్ పర్మిట్లను కూడా ఉచితంగానే జారీ చేయనున్నారు.
ఒకవేళ ఎవరైనా సాంకేతిక కారణాల వల్ల వీసా పొడిగింపునకు దరఖాస్తు చేయలేకపోయినా, దానిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబోమని అధికారులు స్పష్టం చేశారు. అలాగే, విమానాల దారి మళ్లింపు వల్ల భారత్‌లో దిగే విదేశీయులకు తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్లను కూడా ఉచితంగా మంజూరు చేయనున్నారు.
మరోవైపు, ఖతార్ ఎయిర్‌వేస్ ద్వారా సుమారు 500 మంది భారతీయులు సురక్షితంగా దోహా నుంచి కొచ్చి, ఇతర ప్రాంతాలకు చేరుకున్నారు. ఖతార్ గగనతలం పాక్షికంగానే తెరిచి ఉండటంతో విమాన సర్వీసులు పరిమితంగా నడుస్తున్నాయి.