ఆదిత్య, యామీల పతనం కోసం ఇండస్ట్రీ వేచి చూస్తోంది: రామ్ గోపాల్ వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలు అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో వేడిని పుట్టిస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను ఆకాశానికెత్తుతూనే, చిత్ర పరిశ్రమలో ఆయన ఎదుర్కొంటున్న అసూయను వర్మ బయటపెట్టారు. ఆదిత్య ధర్, ఆయన భార్య, నటి యామీ గౌతమ్‌ల పతనం కోసం పరిశ్రమ మొత్తం వేచి చూస్తోందని వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ చూసినప్పటి నుండి తాను ఆయనకు అభిమానిని అయిపోయానని వర్మ చెప్పుకొచ్చారు.


ఆదిత్య ధర్ సినిమా మేకింగ్‌లో సరికొత్త పద్ధతులను, కథ చెప్పే తీరులో కొత్త గ్రామర్‌ను ప్రవేశపెట్టారని వర్మ కొనియాడారు. ఆయన ప్రభావం ఎంతలా ఉందంటే, టాలీవుడ్‌లో రాబోయే పలు భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు ‘ధురంధర్’ మేకింగ్ స్టైల్‌ను చూసి తమ షూటింగ్‌లను ఆపేసి మరీ రీ-షూటింగ్ చేసుకుంటున్నాయని వెల్లడించారు. దీనివల్ల నిర్మాతల పై బడ్జెట్ భారం పడుతోందని, అందుకే పరిశ్రమకు ఆయనపై కోపం, అసూయ పెరిగిపోయాయని వర్మ విశ్లేషించారు. ఆదిత్య, యామీలు ఎప్పుడు తప్పు చేస్తారా? అని అందరూ ఎదురుచూస్తున్నారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వర్మను విమర్శిస్తున్నారు.


రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించగా, ఇప్పుడు దాని సీక్వెల్ ‘ధురంధర్: ది రివెంజ్’ విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా యష్ నటించిన ‘టాక్సిక్’తో తలపడాల్సి ఉండగా, అది వాయిదా పడటంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పోటీ పడబోతోంది. మార్చి 19న ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టబోతుండటంతో సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.



More Telugu News