ఏపీకి భారీగా కేంద్ర నిధులు

  • మోంథా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాలకు ఆర్థిక సాయం 
  • ఏపీకి అదనంగా రూ. 341.48 కోట్ల మంజూరు
  • మొత్తం ఆరు రాష్ట్రాలకు రూ. 1,912.99 కోట్ల నిధులకు కేంద్రం ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఊరటనిస్తూ విపత్తు సహాయక నిధులను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుపాను, దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అదనపు ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఆంధ్రప్రదేశ్‌కు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుంచి అదనపు సహాయంగా రూ. 341.48 కోట్లు మంజూరు చేశారు. ఏపీతో పాటు ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, జమ్మూకశ్మీర్ వంటి మొత్తం 6 రాష్ట్రాలకు కలిపి రూ. 1,912.99 కోట్ల నిధులను కేంద్రం ఆమోదించింది. గత ఏడాది సంభవించిన వరదలు, క్లౌడ్ బరస్ట్‌లు, భూపాతాలు మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని వణికించిన 'మొంథా' తుపాను వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ నిధులు కేటాయించారు. 


మొంథా తుపాను వల్ల ఏపీలో సుమారు రూ. 6,300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి, తక్షణ సాయం అందించాలని గతంలోనే కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇప్పటికే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) కింద వివిధ రాష్ట్రాలకు నిధులు విడుదల చేసిన కేంద్రం, ఇప్పుడు అదనపు సాయం అందించడం ద్వారా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తోడ్పాటునందించింది.



More Telugu News