Nara Lokesh: పిల్లలకు నాసిరకం భోజనం... మంత్రి నారా లోకేశ్ ఫైర్... హెడ్మాస్టర్‌పై వేటు

Nara Lokesh Fires Over Poor School Meals Headmaster Suspended
  • ఎన్టీఆర్ జిల్లా స్కూల్‌లో నాసిరకం భోజనంపై మంత్రి లోకేశ్ ఆగ్రహం
  • విచారణ జరిపి ఫుడ్ ఏజెన్సీ మార్పు, హెడ్మాస్టర్‌ను సస్పెండ్ చేసిన విద్యాశాఖ
  • జరిగిన అసౌకర్యానికి విద్యార్థులు, తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పిన మంత్రి లోకేశ్
  • లీప్ యాప్ ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకొని పర్యవేక్షణను బలోపేతం చేస్తామని హామీ
ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యతలేని మధ్యాహ్న భోజనం అందించిన ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. సమాచారం అందిన వెంటనే చర్యలకు ఉపక్రమించిన ఆయన, ఈ ఘటనకు బాధ్యుడిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగిన అసౌకర్యానికి మంత్రి వ్యక్తిగతంగా క్షమాపణలు తెలిపారు.

మైలవరం మండలం దేవుని చెరువు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత సరిగా లేదని ఫిర్యాదు అందడంతో విద్యాశాఖ వెంటనే రంగంలోకి దిగింది. మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఈ విషయంపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా, భోజనం సరఫరా చేస్తున్న ఏజెన్సీని తక్షణమే తొలగించి, కొత్త ఏజెన్సీని నియమించారు. అదే సమయంలో, పర్యవేక్షణలో విఫలమైనందుకు పాఠశాల హెడ్మాస్టర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన సేవలు, సంరక్షణ అందించడమే మా లక్ష్యం. జరిగిన పొరపాటుకు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను," అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ స్వీకరించేందుకు ‘లీప్ (ఎల్ఈఏపీ)’ యాప్‌ను మరింత బలోపేతం చేస్తామని, సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మంత్రి సవితతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా

మరోవైపు, అనకాపల్లి జిల్లా చీడికాడలోని బీసీ బాలికల వసతిగృహంలో ఆహార కొరత ఏర్పడిన ఘటనపై నారా లోకేశ్ స్పందించారు. హాస్టల్‌లో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారని ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో తన దృష్టికి రావడంతో ఆయన చలించిపోయారు. ఈ ఘటన తనను ఎంతో బాధించిందని పేర్కొంటూ, వెంటనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అక్కడి విద్యార్థినులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. విద్యార్థినులకు ఎదురైన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నానని, ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు ఆ మహిళకు ధన్యవాదాలు తెలిపారు.


Nara Lokesh
NTR District
Midday Meal Scheme
Government School
Food Quality
Education Minister
Suspension
LEAP App
BC Girls Hostel
Savitha

More Telugu News