భారత క్రికెట్ జట్టు మెగా షెడ్యూల్... మరో రెండు కొత్త సిరీస్‌లపై చర్చలు!

  • ఈ ఏడాది టీమిండియా ఫుల్ బిజీ
  • శ్రీలంక, ఐర్లాండ్‌లో అదనపు టీ20 సిరీస్‌లు ఆడేందుకు బీసీసీఐ ప్రణాళిక
  • వరద బాధితుల సహాయ నిధి కోసం మూడు టీ20ల సిరీస్ కు లంక ప్రతిపాదన
  • ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్‌తో సిరీస్‌పై చర్చలు!
రానున్న 12 నెలల పాటు అత్యంత బిజీ షెడ్యూల్‌తో ఉన్న టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్... ఈ సీజన్ లో మరో రెండు అదనపు టీ20 సిరీస్‌లు ఆడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలు ద్వైపాక్షిక సిరీస్‌లు, టోర్నమెంట్‌లు ఖరారైన నేపథ్యంలో శ్రీలంక, ఐర్లాండ్‌లలో పొట్టి ఫార్మాట్ సిరీస్‌లు ఆడే ప్రతిపాదనలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పరిశీలిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టులకు ముందు మూడు టీ20 మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. జూలై-ఆగస్టు నెలల్లో ఈ మ్యాచ్‌లు జరగవచ్చు. గతేడాది నవంబర్‌లో వచ్చిన 'దిత్వా' తుపాను కారణంగా శ్రీలంక తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయ నిధి కోసం ఈ టీ20 సిరీస్‌ను నిర్వహించాలని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్ సీ) బోర్డు బీసీసీఐని కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత టీ20 జట్టు ముందుగా ఈ సిరీస్‌ ఆడి, ఆ తర్వాత టెస్టు మ్యాచ్‌లలో పాల్గొంటుంది.

మరోవైపు, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందు ఐర్లాండ్‌లో కూడా టీమిండియా పర్యటించే అవకాశాలున్నాయి. జూన్ చివరి వారంలో డబ్లిన్‌లో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ నిర్వహించడంపై బీసీసీఐ, క్రికెట్ ఐర్లాండ్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఐర్లాండ్‌లో క్రికెట్ అభివృద్ధికి మద్దతుగా భారత్ గతంలో 2018, 2022, 2023 సంవత్సరాల్లో కూడా పర్యటించింది.

జూన్ 6 నుంచి 20 వరకు ఆఫ్ఘనిస్థాన్‌తో స్వదేశంలో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత ఈ అదనపు సిరీస్‌లలో పాల్గొని, జూలై 1 నుంచి 19 వరకు ఇంగ్లండ్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ కొత్త సిరీస్‌లు కూడా ఖరారైతే టీమిండియా షెడ్యూల్ మరింత బిజీగా మారనుంది


More Telugu News