పన్ను ఎగవేతదారులు తప్పించుకోవడానికి వీల్లేదు: సీఎం చంద్రబాబు

  • పన్ను ఎగవేతలను అరికట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
  • ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఏపీలో పనిచేసే కాంట్రాక్టర్లపై ప్రత్యేక దృష్టి
  • పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం
  • ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం నుంచి అందే లబ్ధిని వివరిస్తూ సంక్షేమ లేఖ ఇవ్వాలని ఆదేశం
  • పథకాల అమలులో పూర్తి పారదర్శకత తీసుకురావడమే లక్ష్యమని వెల్లడి  
రాష్ట్రంలో పన్ను ఎగవేతలను నిరోధించేందుకు పటిష్ఠమైన కార్యాచరణ చేపట్టాలని, ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలో కొనసాగుతున్న ఆరో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భాగంగా ఆయన ఆదాయార్జన శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పన్ను ఎగవేతలపై కఠినంగా వ్యవహరించాలని, అయితే పన్ను చెల్లింపుదారులను అనవసరంగా వేధించవద్దని స్పష్టం చేశారు.

కొందరు కాంట్రాక్టర్లు తమ కార్యాలయాలను పొరుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకొని, ఆంధ్రప్రదేశ్‌లో పనులు చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టుల పనులు చేస్తున్నప్పటికీ, వారి నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నులు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. టెండర్లు, వర్క్ ఆర్డర్లలో ఉన్న కాంట్రాక్టర్ల నుంచి ఆదాయం రాబట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు చెల్లించే పన్నులు మన రాష్ట్ర ఖజానాకే చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గట్టిగా చెప్పారు.

"పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధి నమోదైతేనే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. ప్రతి రంగంలోనూ వృద్ధి సాధించడం ద్వారా నిర్దేశిత జీఎస్‌డీపీ లక్ష్యాన్ని చేరుకోవాలి" అని చంద్రబాబు అన్నారు. పన్ను ఎగవేతలకు పాల్పడి ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదని, చట్ట ప్రకారం ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించేలా చూడాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పన్ను వసూళ్ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తూనే, నిజాయితీపరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

ప్రతి లబ్ధిదారుడికి 'సంక్షేమ లేఖ'

సూపర్‌ సిక్స్‌ సహా ఇతర సంక్షేమ పథకాల అమలులో పూర్తిస్థాయి పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రయోజనాలను వివరిస్తూ 'సంక్షేమ లేఖ' అందజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, "ప్రతి నెలా ఏ కుటుంబానికి పెన్షన్, ఉచిత సిలెండర్, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుందో స్పష్టంగా తెలియజేస్తూ లేఖ ఇవ్వాలి. దీనివల్ల ప్రభుత్వ పనితీరులో పారదర్శకతతో పాటు, లబ్ధిదారుల్లో పథకాలపై యాజమాన్య భావన పెరుగుతుంది" అని అన్నారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి త్వరలోనే ఒక క్యాలెండర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

"పెట్టుబడుల గురించి ఎలా ఆలోచిస్తున్నామో, అదే స్థాయిలో పేదల సంక్షేమం, వారి సాధికారత గురించి కూడా కలెక్టర్లు ఆలోచించాలి. సంపద సృష్టితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ధ్యేయం" అని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద మార్చి 9 నాటికి 50.45 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయని, ఇందుకోసం ఆర్టీసీకి ప్రభుత్వం రూ.1,775 కోట్లు రీయింబర్స్‌ చేసిందని తెలిపారు.

సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఉగాది నాటికి 2.5 లక్షల సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలని, ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన అధికారులకు సూచించారు.


More Telugu News