సీఎం చంద్రబాబు అభినందించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన మంత్రి కందుల దుర్గేశ్

  • ఏపీ పర్యాటక రంగంలోకి పెట్టుబడులు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
  • విశాఖలో భారీ అమ్యూజ్‌మెంట్ పార్క్
  • రూ.100 కోట్లతో ఒప్పందం
  • ముంబై పర్యటన విజయవంతం అయిందన్న మంత్రి కందుల దుర్గేశ్ 
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను జరిపిన ముంబై పర్యటనను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించడంపై రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం ప్రశంసలు తనలో మరింత ఉత్సాహాన్ని నింపాయని ఆయన తెలిపారు.

ముంబయిలో జరిగిన ఐఏఏపీఐ ఎక్స్‌పోలో తాను పాల్గొని, రాష్ట్ర పర్యాటక పాలసీ, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించినట్లు మంత్రి తెలిపారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. ప్రముఖ సంస్థ ‘మోడ్రన్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్’ విశాఖపట్నంలో రూ.100 కోట్ల పెట్టుబడితో ఒక భారీ అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినట్లు వెల్లడించారు.

ఈ పర్యటనలోనే ఏఐ ఆధారిత సినిమా, స్కిల్ డెవలప్‌మెంట్ అవకాశాలపై యూరోస్ సంస్థ ప్రతినిధులతో ఫలప్రదమైన చర్చలు జరిపినట్లు దుర్గేశ్ వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశంతో అమరావతిలో 'క్రియేటివ్ సిటీ'ని ఏర్పాటు చేసి, రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీకి కొత్త అవకాశాలు సృష్టించేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News