‘హర్మూజ్’ను సురక్షితంగా దాటిన రెండు భారత నౌకలు!

  • ఇరాన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ చర్చలతో సానుకూల పరిణామం
  • యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ దాటిన తొలి భారత నౌక
  • సౌదీ నుంచి ముంబై చేరిన ఆయిల్ ట్యాంకర్ షిప్
పశ్చిమాసియా యుద్ధ మేఘాల మధ్య అత్యంత ఉత్కంఠ నెలకొన్న హర్మూజ్ జలసంధిని రెండు భారత వాణిజ్య నౌకలు సురక్షితంగా దాటాయని సమాచారం. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య జరిగిన కీలక చర్చల అనంతరం ఈ సానుకూల పరిణామం చోటుచేసుకుందని తెలుస్తోంది. యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఈ జలసంధి గుండా ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారిన తరుణంలో భారత జెండా ఉన్న నౌకలకు ఇరాన్ ప్రభుత్వం ప్రత్యేక భద్రతా భరోసా కల్పించింది.

ఈ దౌత్యపరమైన ముందడుగుతో భారత్‌కు అందే ముడి చమురు, ఎరువుల సరఫరాకు ఎదురైన అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది. జైశంకర్ తన ఇరాన్ సహచరుడితో జరిపిన సంప్రదింపుల్లో భారత ఆర్థిక ప్రయోజనాలను, నౌకల భద్రతను ప్రధానంగా ప్రస్తావించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఇరాన్, భారత నౌకలను తమ ఐఆర్ జీసీ దళాలు లక్ష్యంగా చేసుకోబోవని, అవి జలసంధిని దాటేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.

యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ దాటిన తొలి నౌక..

ఇరాన్, అమెరికా మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్ జలసంధి దాటి తొలి ముడి చమురు నౌక భారత్‌కు చేరుకుంది. ‘హిందుస్థాన్ టైమ్స్’ నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియా నుంచి ముడి చమురును తీసుకువస్తున్న ‘షెన్‌లాంగ్ సూయజ్‌మాక్స్’ చమురు ట్యాంకర్ ముంబై పోర్టుకు చేరుకుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా సురక్షితంగా ప్రయాణించిన మొదటి భారతీయ నౌక ఇదే. 

లైబీరియాలో రిజిస్టరైన ఈ ట్యాంకర్ కు ఒక భారతీయుడు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది మార్చి 1న రాస్ తనూరా చమురు టెర్మినల్‌లో ముడి చమురును లోడ్ చేసుకుని, రెండు రోజుల తర్వాత తన ప్రయాణాన్ని ప్రారంభించింది. మారిటైమ్ ట్రాకింగ్ సంస్థలు ‘లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్’, ‘ట్యాంకర్ ట్రాకర్స్’ నివేదికల ప్రకారం.. ఈ నౌక మార్చి 8న హర్మూజ్ జలసంధి లోపల ఉన్నప్పుడు చివరిసారిగా దీని సిగ్నల్ నమోదైంది.

 డేంజర్ జోన్‌ను దాటేటప్పుడు ఏం చేశారంటే.. 

హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించిన తర్వాత ట్యాంకర్ కొద్దిసేపు ‘‘డార్క్” మోడ్ లోకి వెళ్లింది. అంటే అది తన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎస్), ట్రాకింగ్ ట్రాన్స్‌పాండర్లను నిలిపివేసింది. ప్రమాదకర ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు శత్రువుల కంటపడకుండా ఉండేందుకు నౌకలు కొన్నిసార్లు ఇలా చేస్తాయని సమాచారం. ప్రమాదకరమైన మార్గాన్ని దాటిన తర్వాత మార్చి 9న ఈ నౌక తిరిగి ట్రాకింగ్ సిస్టమ్స్‌లో కనిపించింది. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు ఈ ట్యాంకర్ ముంబై చేరుకుందని పోర్టు అధికారులు తెలిపారు.


More Telugu News