Allu Cinemas: హైదరాబాద్‌లో అల్లు సినిమాస్.. రెండు భారీ చిత్రాలతో గ్రాండ్ ఓపెనింగ్!

Allu Cinemas Launch Hyderabad by CM Revanth Reddy Showing Ustaad Bhagat Singh Dhurandhar 2
  • రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం
  • ఈ నెల‌ 19న పవన్ కల్యాణ్, రణ్‌వీర్ సింగ్ చిత్రాలతో గ్రాండ్ ఓపెనింగ్
  • ఇండియాలోనే అతిపెద్ద 75 అడుగుల డాల్బీ సినిమా స్క్రీన్ ఏర్పాటు
  • హైదరాబాద్‌లో తొలిసారిగా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో థియేటర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్’ అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఉన్న అల్లు స్టూడియోస్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ మల్టీప్లెక్స్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల‌ 19వ తేదీ నుంచి రెండు భారీ చిత్రాలతో ఈ థియేటర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ థియేటర్‌లో తొలి ప్రదర్శనలుగా రెండు క్రేజీ సినిమాలు సందడి చేయనున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్ 2: ది రివెంజ్’ చిత్రాలను ఈ నెల‌ 19 నుంచి ప్రదర్శించనున్నారు. అంతకంటే ఒకరోజు ముందుగా అంటే 18న ‘ధురంధర్ 2’ పెయిడ్ ప్రివ్యూలను కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

అల్లు సినిమాస్‌కు ప్రత్యేకలివే..
అల్లు సినిమాస్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది హైదరాబాద్ నగరంలోనే మొట్టమొదటి డాల్బీ సినిమా థియేటర్. ఇందులో ఏర్పాటు చేసిన 75 అడుగుల వెడల్పున్న స్క్రీన్, ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌గా నిలుస్తోంది. ఆసియాలో అతిపెద్దదిగా, ప్రపంచంలో రెండో అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌గా దీనికి గుర్తింపు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ థియేటర్‌ను తీర్చిదిద్దారు. స్పష్టమైన, ప్రకాశవంతమైన విజువల్స్ కోసం డాల్బీ విజన్ 3D ప్రొజెక్షన్, ప్రతి దిశ నుంచి వచ్చే అద్భుతమైన ఆడియో అనుభూతి కోసం డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు.

ఈ ఏడాది జనవరి 3న అల్లు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో అల్లు సినిమాస్ సాఫ్ట్ లాంచ్‌ను నిర్వహించారు. ఆ మరుసటి రోజు, జనవరి 4న అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి థియేటర్‌లో సాంకేతిక అంశాలను స్వయంగా పరీక్షించారు. ప్రొజెక్షన్ సిస్టమ్స్, సౌండ్ సెటప్, ఇతర సౌకర్యాలను పరిశీలించి, పబ్లిక్ ఓపెనింగ్‌కు అంతా సిద్ధంగా ఉందని నిర్ధారించుకున్నారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేందుకు అల్లు సినిమాస్ సిద్ధమైంది.
Allu Cinemas
Allu Arjun
Allu Studios
Allu Cinemas Hyderabad
Revanth Reddy
Ustaad Bhagat Singh
Ranveer Singh
Dhurandhar 2
Dolby Cinema
Hyderabad Theatre
Telangana Cinema

More Telugu News