ఇంటర్వ్యూలో రూ.28 లక్షల ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు రూ.36 లక్షలు అడిగిన టెకీ

  • కంపెనీ యజమాని ఆగ్రహం.. సోషల్ మీడియాలో పోస్ట్
  • ఒకసారి ఆమోదం తెలిపాక మళ్లీ ఎక్కువ అడగడం సరికాదంటూ ఆగ్రహం
  • నియామకం పూర్తికావడంతో తాము ఇంటర్వ్యూలు ఆపేశామని వెల్లడి
  • తీరా ఇప్పుడు ఈ మెలిక పెట్టడంతో సదరు అభ్యర్థిపై ఫైర్
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ‘ప్యాకేజీ’ల పరుగు ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పే ఘటనే ఇది. తన కంపెనీలో చేరతానని మాట ఇచ్చిన ఒక టెకీ.. తీరా జాయినింగ్ తేదీకి రెండు రోజుల ముందు ఊహించని మెలిక పెట్టడంతో ఒక స్టార్టప్ యజమాని అసహనానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకోవడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..

ఉద్యోగ నియామక ఇంటర్వ్యూకు హాజరైన ఓ టెకీకి ఒక స్టార్టప్ కంపెనీ రూ.28 లక్షల వార్షిక ప్యాకేజీతో జాబ్ ఆఫర్ చేసింది. పాత కంపెనీలో అతడు అందుకుంటున్న రూ.21 లక్షల ప్యాకేజీకి దాదాపు 33 శాతం హైక్ ఇచ్చేందుకు సిద్ధపడింది. ఈ ఆఫర్ నచ్చడంతో సదరు టెకీ కూడా తన ఆమోదం తెలిపాడు. అయితే, నోటీస్ పీరియడ్ కారణంగా జాయినింగ్ కు సమయం కోరాడు. దీనికి ఆమోదం తెలుపుతూ టెకీకి అనుకూలమైన తేదీని జాయినింగ్ డేట్ గా పేర్కొంటూ కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చింది. అయితే, విధుల్లో చేరడానికి కేవలం రెండు రోజుల ముందు, ఆ టెకీ మళ్ళీ కంపెనీని సంప్రదించాడు. తనకు మరో కంపెనీలో రూ.31 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్ వచ్చిందని చెబుతూ.. ఇంటర్వ్యూలో తాను అంగీకరించిన రూ.28 లక్షల ప్యాకేజీని పెంచాలని కోరాడు. రూ.36 లక్షల వార్షిక వేతనం ఆఫర్ చేస్తే కంపెనీలో చేరుతానని మెలిక పెట్టాడు.

ఒకే చెప్పాక మళ్లీ బేరసారాలేంటి..

ఈ పరిణామంతో సదరు టెకీపై కంపెనీ యజమాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ముందే అంగీకరించి చివరి నిమిషంలో ఇలాంటి డిమాండ్లు పెట్టడం ఏంటి? దీనివల్ల ప్రాజెక్టుల సమయం వృధా అవ్వడమే కాకుండా కంపెనీ నమ్మకం దెబ్బతింటుంది’’ అని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ముందు ఒప్పుకున్నాక ఇప్పుడు జీతం పెంచితేనే వస్తానని అనడం ఏంటని ప్రశ్నించాడు. జీతం విషయంలో బేరసారాలు తప్పని తాను అనడంలేదని, అయితే అదంతా ఆఫర్ ఒప్పుకోవడానికి ముందే చేయాలని పేర్కొన్నారు. తమకు కావాల్సిన ఉద్యోగి దొరికాడని ఇంటర్వ్యూలు కూడా ఆపేశామని ఆయన వివరించారు.

నెటిజన్ల రియాక్షన్..

ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. ‘‘ఇది ముమ్మాటికీ ప్రొఫెషనలిజం కాదు, చివరి నిమిషంలో బ్లాక్ మెయిల్ చేయడమే’’ అని కొందరు యజమానికి మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం ‘‘మార్కెట్‌లో పోటీ ఎక్కువగా ఉంది, ఎక్కువ జీతం వచ్చే చోటికి వెళ్లడంలో తప్పులేదు’’ అని టెక్కీని వెనకేసుకొస్తున్నారు. మొత్తానికి ప్రస్తుత ఐటీ మార్కెట్‌లో ‘ఆఫర్ లెటర్లు’ ఇచ్చినా సరే ఉద్యోగి కంపెనీలో అడుగు పెట్టే వరకు నమ్మకంలేని పరిస్థితి ఏర్పడిందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.



More Telugu News